శక్తికి శక్తి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మేక మాంసంలో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్ మావ.. ఇలా తిన్నారంటే..
మటన్ పాయా వంటకం చాలా ఆరోగ్యకరమైనది.. ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారికి పెద్దలు దీన్ని సిఫార్సు చేస్తారు. ఇది చపాతీ, రోటీ, అన్నం, రాగి సంగటిలోకి అద్భుతమైన రుచిని అందిస్తుంది. అయితే.. మటన్ పాయా అద్భుతంగా తయారుచేసుకోవడం ఎలానో ఈ కథనంలో తెలుసుకోండి..

మటన్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే.. మటన్ పాయ (మేక కాళ్ళ సూప్) సూప్ టేస్టే వేరు.. మటన్ పాయ ఎముకల బలానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సాంప్రదాయ వంటకం.. ఈ వంటకం కేవలం రుచికరమైనదే కాకుండా, బలహీనంగా ఉన్నవారికి, ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు తరచుగా చెబుతుంటారు. మటన్ పాయ కొల్లాజెన్, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో కూడిన అత్యంత పోషకమైన ఆహారం. ఇది ఎముకల బలం, కీళ్ల ఆరోగ్యం, చర్మ సౌందర్యం, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాయా కూర చపాతీ, రోటీ, అన్నం, రాగి సంగటి వంటి వాటితో కలిపి తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఆంధ్రా స్టైల్ లో మటన్ పాయను ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
తయారీ విధానం:
ముందుగా శుభ్రం చేసుకోవాలి.. నాలుగు మేక కాళ్ళను (పాయా) నాన్-వెజ్ షాపుల నుండి తీసుకొని, కనీసం నాలుగు నుండి ఐదు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. సరిగ్గా కడగకపోతే కూర రుచిగా ఉండదు. శుభ్రం చేసిన కాళ్ళకు కొద్దిగా కరివేపాకు, పసుపు, రాళ్ళ ఉప్పు కలిపి పక్కన పెట్టాలి.
వంట ప్రారంభించడానికి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూను మినప్పప్పు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మూడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేవరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి.
మసాలా పేస్ట్ తయారీ:
ఒక మిక్సీ జార్‌లో ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, పది వెల్లుల్లి రెబ్బలు (పొట్టు తీసినవి), ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, నాలుగు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి నున్నగా కాకుండా, కొంచెం పలుకుగా పేస్ట్ చేసుకోవాలి.
కూర వండటం:
ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత, పావు టీ స్పూన్ పసుపుపొడి, రెండు టేబుల్ స్పూన్ల కారంపొడి (నాన్-వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది), ఇంకొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. తరువాత, రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసి, బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు బాగా కలిసిపోయే వరకు వేయించాలి. మసాలాలు పచ్చి వాసన లేకుండా బాగా వేగిన తర్వాత, కొంచెం కరివేపాకు, అర టీ స్పూన్ తాజాగా దంచుకున్న మిరియాల పొడి వేయాలి.
నీరు కలిపి ఉడికించడం:
ఒక పెద్ద గ్లాసుతో రెండున్నర గ్లాసుల నీళ్లు పోసి, కొద్దిగా కొత్తిమీర తరిగి వేయాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని అవసరమైతే సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి, ముందుగా హై ఫ్లేమ్‌లో కొద్దిసేపు ఉంచి, ఆపై మీడియం ఫ్లేమ్‌కు మార్చి మొత్తం 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. దీనివల్ల మటన్ పాయా పూర్తిగా మెత్తగా ఉడికి, రుచికరంగా తయారవుతుంది.
వడ్డించడం:
కూర సిద్ధమైన తర్వాత, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేయాలి. ఈ కూర చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. తక్కువ నూనె వాడటం మంచిది. ఎందుకంటే పాయాలో సహజంగా నూనె శాతం ఉంటుంది. ఈ రుచికరమైన మటన్ పాయా కూరను రాగి సంగటి, చపాతీ లేదా అన్నంతో ఆస్వాదించవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
