AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుక్ చేసింది ఓ చోటకు.. తెమ్మంది మరో చోటకు.. అలా కుదరదు అన్నందుకు..

మణికొండలో తాగునీటి సరఫరా కోసం వెళ్లిన HMWSSB వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి జరగడం కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ది సిటిజన్స్ కౌన్సిల్‌తో పాటు సహచర డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.

బుక్ చేసింది ఓ చోటకు.. తెమ్మంది మరో చోటకు.. అలా కుదరదు అన్నందుకు..
Water Tanker
Sravan Kumar B
| Edited By: |

Updated on: May 30, 2026 | 7:50 PM

Share

ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి జరగడం మణికొండ ప్రాంతంలో కలకలం రేపింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కి చెందిన ట్యాంకర్ డ్రైవర్ మణికంఠపై జరిగిన దాడిని ది సిటిజన్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

సమాచారం ప్రకారం.. విధుల్లో భాగంగా మణికంఠ తనకు కేటాయించిన ప్రాంతానికి తాగునీటి సరఫరా కోసం వెళ్లాడు. ఈ సమయంలో ఓ వినియోగదారు ట్యాంకర్‌లోని నీటిని మరో ప్రాంతానికి తరలించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే బుకింగ్ వివరాలు, అధికారిక నిబంధనలకు విరుద్ధంగా నీటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడం సాధ్యం కాదని డ్రైవర్ స్పష్టం చేశాడు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, అనంతరం వినియోగదారుడి సోదరుడు అక్కడికి వచ్చి డ్రైవర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో మణికంఠకు గాయాలయ్యాయని, ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు సహచరులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన ది సిటిజన్స్ కౌన్సిల్.. ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్లపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొంది. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరిగే సమయంలో ప్రజలకు సేవలందించేందుకు డ్రైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని, అలాంటి సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడటం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. సేవలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇదిలా ఉండగా, సహచర డ్రైవర్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భద్రతకు హామీ కల్పించాలని, విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ది సిటిజన్స్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. ప్రజా సేవల సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడింది.

Follow Us