Idli recipe: ఇడ్లీలు గుండ్రాళ్లలా కాకుండా సుతి మెత్తగా రావాలంటే.. ఈసారి ఈ టిప్స్ ట్రై చేయండి..
ఇడ్లీని ఎన్ని రకాల చట్నీలతో చేసుకున్నా తనివి తీరదు. వేడి వేడి సాంబార్ లో వేసుకుని తింటే ఆ రుచే వేరు. కానీ, ఎంత ప్రయత్నించినా ఇంట్లో చేసిన ఇడ్లీలు సాఫ్ట్ గా రావట్లేదా.. అందుకు కారణం లేకపోలేదు. చాాలా మంది ఇడ్లీ కి కావలసిన పదార్థాలను నానబెట్టుకోవడం దగ్గర నుంచి మిక్సీ పట్టే వరకు చేసే కొన్ని చిన్న చిన్నపొరపాట్లే ఇడ్లీలను రాళ్లలా మార్చేస్తుంటాయి. ఈ సారి ఈ టిప్స్ తో ఇడ్లీ చేసి చూడండి..

దక్షిణాది వారు ఎంతో ఇష్టంగా తినే బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ లో ఇడ్లీ కచ్చితంగా ఉండి తీరుతుంది. సుతి మెత్తగా, ముత్యాల్లాంటి రంగులో వేడి వేడి ఇడ్లీలు ఆరగించడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ చాలా మంది ఇళ్లలో ఇడ్లీలు హోటల్స్ చేసినట్టుగా మెత్తగా రావు. కొన్ని చేసిన వెంటనే రాళ్లలా గట్టిగా మారిపోతుంటాయి. మరికొన్ని మరీ పిండిముద్దలుగా వస్తుంటాయి. ఎంత ట్రై చేసినా ఇడ్లీలు సాఫ్ట్ గా రావడం లేదంటే ఈ సారి ఇడ్లీ పిండి పట్టేటప్పుడు ఈ టిప్స్ ట్రై చేయండి. కచ్చితంగా మీ ఇంటిల్లిపాది నుంచి మీరు కాంప్లిమెంట్స్ అందుకుంటారు.
కావాల్సిన పదార్థాలు:
ఇడ్లీ రవ్వ – రెండున్నర కప్పులు మినప గుండ్లు – 1 కప్పు సగ్గుబియ్యం – పావు కప్పు సోయా బీన్స్- టేబుల్ స్పూన్ ఉప్పు – రుచికి సరిపడా
పప్పు, రవ్వను ఇలా నానబెట్టాలి..
మీరు ఇడ్లీకోసం చేసే ప్రిపరేషన్ లాగే ఇది కూడా తయారు చేసుకోండి. ఒక గిన్నెలో మినప గుండ్లు, సగ్గుబియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. ఇడ్లీల కోసం మినప గుండ్లను మరీ ఎక్కువగా నానబెట్టకూడదని గుర్తించుకోండి. ఇలా చేయడం వల్లే ఇడ్లీలు గట్టిగా మారిపోతుంటాయి. ఇడ్లీ రవ్వను కూడా విడిగా తీసుకుని శుభ్రం చేసుకోండి. ఇందులో కాసింత ఉప్పు కలుపుకుని దీనిని కూడా దాదాపు 5 గంటలపాటు నానేలా చూడండి.
మిక్సీ పట్టేటప్పుడు ఒక స్పూన్ వీటిని కలపండి
ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ సారి పైన చెప్పిన పదార్థాలతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ సోయా బీన్స్ గింజలను కూడా నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీజార్లోకి నానబెట్టిన సోయా బీన్స్, మినప గుండ్లను మిక్సీకి వేసుకోవాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి.
ఇలా సెట్ చేసుకోండి..
మిక్సీలో పట్టిన మిశ్రమాన్నిరవ్వతో కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు కలిసేలాగా గరిటతో తిప్పుకోవాలి. దీన్ని ఒక 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇలా పులిసిన మిశ్రమంలో కాసింత ఉప్పు వేసి కలిపి ఇడ్లీ ప్లేటుల్లోకి అమర్చుకుని ఎప్పుడూ చేసుకునే విధంగానే ఇడ్లీలను ఆవిరిపై ఉడికించుకోవాలి.




