Mango Cashew Curry: చికెన్, మటన్ మించి టేస్టీ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కూర రెసిపీ
వేసవి వచ్చిందంటే చాలు రకరకాల సీనల్ పండ్లు మార్కెట్ లో సందడి చేస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే మామిడి పండు కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తారు. ఇక పచ్చి మామిడి కాయతో కూడా రకరకాల కూరలు, పచ్చళ్ళు, డ్రింక్స్ తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే వేసవి కాలంలో మామిడి కాయను ఏదోక రూపంలో తీసుకుంటూనే ఉంటారు. గోదావరి జిల్లాల్లో అయితే ఈ వేసవి సీజన్ లో ఎక్కడ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు జరిగినా మామిడికాయ జీడి పప్పు కూర ఉండాల్సిందే. ఈ రోజు మామిడికాయ జీడిపప్పు కూర తయారీ విధానం తెలుసుకుందాం..

ఈ సీజన్ లో లభించే వాటిల్లో మామిడికాయలు ఒకటి. పుల్లని మామిడి కాయలతో రకరకల ఆహార పదార్ధాలు తయారు చేస్తారు. మామిడి కాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడి కాయ పచ్చడి, వంటివి మాత్రమే కాదు మామిడికాయలతో ఆవకాయ, మాగాయ వంటి నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు. అయితే గోదావరి జిల్లాల్లో మామిడి కాయ జీడిపప్పు కూరని ఎక్కువగా చేసుకుంటారు. ఈ సీజన్ లో ఏ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మామిడికాయ జీడి పప్పు కూర ఉండాల్సిందే. ఈ కూరకు చికెన్, మటన్ కంటే ప్రాధాన్యత ఇస్తారు. అంతటి రుచి ఈ కూర సొంతం. ఈ రోజు ఫంక్షన్లలో తయారు చేసే మామిడి కాయ జీడిపప్పు కూర రెసిపీ తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు
- పుల్లటి మామిడి కాయ మీడియం సైజ్ -1
- జీడి పప్పు – ఒక కప్పు
- ఉల్లిపాయలు – పెద్దవి రెండు
- కారం – రెండు స్పూన్లు
- ధనియాల పొడి – ఒక స్పూన్
- జీలకర్ర పొడి – అర స్పూన్
- గరం మసాలా పొడి- పావు స్పూన్
- పసుపు- చిటికెడు
- పచ్చి మిర్చి – 4
- కరివేపాకు – కొంచెం
- కొత్తిమీర – కొంచెం
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె -4స్పూన్లు
తయారీ విధానం: ముందుగా జీడిపప్పుని ఒక గిన్నెలో వేసి వేడి నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని తగినంత నూనె పోసి వేడి ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించిన తర్వాత్ నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత నీటి నుంచి తీసిన జీడిపప్పుని వేసి ఉల్లిపాయలతో పాటు మగ్గించాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి పసుపు తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు, జీడిపప్పుని వేయించాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం నీరు పోసి .. మూత పెట్టి జీడిపప్పుని ఉడికించాలి. తర్వాత ఉల్లిపాయల మిశ్రమంలో కట్ చేసిన మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలిపి ఉప్పు, కారం చూసుకోవాలి. తర్వాత కొంచెం నీరు పోసి మామిడి కాయ ముక్కలు ఉడికించాలి. నూనె పైకి వచ్చిన తర్వాత కట్ చేసి న కొత్తమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కూర మామిడి కాయ జీడిపప్పు రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








