మిగిలిన అన్నంతో కర్ణాటక స్టైల్ అక్కీ రోటీ రెసిపీ..! ఇంట్లోనే ఈజీగా చేయండి..!
మనలో చాలా మంది ముఖ్యంగా ఉదయం భోజనం చేయడానికి సిద్ధం అవుతుంటే.. రాత్రి మిగిలిన ఆహారాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. మిగిలిన అన్నాన్ని పారవేయకుండా ఏదైనా రుచికరమైన వంటకాన్ని తయారు చేయడం సాధ్యమైతే చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మిగిలిపోయిన అన్నంతో కర్ణాటక స్పెషల్ అక్కీ రోటీని సులభంగా తయారు చేయవచ్చు. దీనికి కొన్ని సాధారణ పదార్థాలు ఉంటే చాలు.

అక్కీ రోటీ అనేది కర్ణాటకకు చెందిన ప్రత్యేకమైన రుచికర వంటకం. దీనిని రుచికరమైన స్నాక్స్‌గా లేదా ఉదయాన్నే అల్పాహారంగా తినవచ్చు. ఈ వంటకాన్ని ప్రధానంగా అన్నంతో తయారు చేస్తారు. మిగిలిపోయిన అన్నంతో సులభంగా తయారుచేయవచ్చు. దీని తయారీ పద్ధతి కూడా తేలికగా ఉంటుంది. ఈ రెసిపీని కొబ్బరి చట్నీతో కలిపి తింటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
- మిగిలిపోయిన అన్నం – 1/2 కప్పు
- జీలకర్ర – 1/2 టీస్పూన్
- సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
- ఉప్పు – రుచికి తగినంత
- కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్
- బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
- పచ్చిమిర్చి – 1-2 (సన్నగా తరిగినవి)
తయారీ విధానం
ముందుగా మిగిలిన అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని బాగా పిసికాలి. అన్నం మెత్తగా పిసికిన తర్వాత దానిలో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తురిమిన కొబ్బరి, బియ్యం పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మెత్తగా పిసికితే రోటీ మంచిగా వస్తుంది.
ఇప్పుడు అరటి ఆకు లేదా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపై కొద్దిగా నువ్వుల నూనె రాసి పిసికిన అన్నాన్ని చిన్న బాల్‌లా చేసి నీటితో తడిపి చేతులతో నెమ్మదిగా చదును చేయాలి. ఓవెన్‌లో లేదా స్టౌవ్‌పై పాన్ బాగా వేడిచేయాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా నూనె పోసి చేసిన రోటీని దానిపై ఉంచాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు బాగా కాల్చాలి.
ఇంతే సింపుల్.. కర్ణాటక స్పెషల్ అక్కీ రోటీ సిద్దమైంది. ఈ రోటీని ఎంచక్కా కొబ్బరి చట్నీతో తింటే రుచి మరింత పెరుగుతుంది. ఇది స్నాక్స్‌గా, అల్పాహారంగా తినవచ్చు. రాత్రి మిగిలిన అన్నాన్ని ఇలా రుచికరంగా మార్చడం చాలా సులభం. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.