Red Meat: ఆదివారం ఇష్టంగా రెడ్ మీట్ తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం కొంపమునిగినట్లే..
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి ముక్కలెనిదే ముద్ద దిగదు. నగరాల్లో ఉంటున్నవారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది.
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలామందికి ముక్కలెనిదే ముద్ద దిగదు. నగరాల్లో ఉంటున్నవారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. అందుకేనేమో ఆ రోజు నాన్-వెజ్ షాపులు బాగా రద్దీగా ఉంటాయి. మార్కెట్‌లో ఎక్కడ చూసినా మటన్, రెడ్ మీట్, చికెన్, చేపలు విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మధ్యకాలంలో రెడ్ మీట్‌ను మాంసాహారులు ఇష్టంగా తింటున్నారు. కొంతమంది రెడ్ మీట్ ఆరోగ్యానికి మంచిదని అంటుంటే.. మరికొందరు లేనిపోని ఆరోగ్య సమస్యలు తెస్తుందని భావిస్తారు. ఈ తరుణంలో తాజాగా శరీరంపై రెడ్ మీట్ ఏమేరకు ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి వైద్య నిపుణులు పలు పరిశోధనలు జరిపారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ మీట్ అంటే ఏమిటి..
ఎర్ర మాంసాన్ని క్షీరద జాతుల మాంసం అని అంటారు, ఇందులో గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రెలు మొదలైనవి ఉంటాయి. శరీరానికి చాలా ముఖ్యమైన ప్రొటీన్, ఐరన్, జింక్, విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా రెడ్ మీట్‌లో ఎక్కువగానే ఉంటాయి. ఇందువల్ల రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం, అనేక రకాల వ్యాధుల వచ్చే అవకాశం ఉంది. ఇటీవల అమెరికాకు చెందిన ఎపిడిమిలోజిస్ట్ జెఫ్రీ స్టాన్‌వే నేతృత్వంలోని పలువురు వైద్య నిపుణులు.. పలు పరిశోధనలు చేసి.. ప్రజల్లో రెడ్ మీట్‌పై ఉన్న వివిధ భయాందోళనలను తొలగించేందుకు ప్రయత్నించింది.
వారు అమెరికాలోని 180 ప్రాంతాలకు చెందిన వ్యక్తులపై ధూమపానం, ఎర్ర మాంసం, కూరగాయలు శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయన్న దానిపై విడివిడిగా పరిశోధనలు జరిపారు. ఇందులో ప్రాసెస్ చేయబడని రెడ్ మీట్ ప్రతీ రోజూ తినడం వల్ల.. గుండెపోటు వచ్చే ప్రమాదం 16 శాతం ఉందని.. అలాగే పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఎవరైనా సరే ఇప్పటికే క్రమం తప్పకుండా రెడ్ మీట్ తింటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెప్పారు.
ధూమపానం ఆరోగ్యానికి శత్రువు..
ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అన్నారు. అలాగే అధిక రక్తపోటు.. గుండె జబ్బులకు దారి తీస్తుందని చెప్పారు.
కూరగాయలతో అనేక వ్యాధులకు చెక్..
వారానికి నాలుగు రోజులు పచ్చి కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 23 శాతానికి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డైట్‌లో పచ్చి కూరగాయలను చేర్చడం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయని స్పష్టమైందని పరిశోధనల్లో పాల్గొన్న ఎపిడిమిలోజిస్ట్ జెఫ్రీ స్టాన్‌వే చెప్పారు.