- Telugu News Lifestyle Food Immunity Fruits: immunity booster these fruits are very beneficial for strong immunity in winter
Immunity Fruits: ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ పండ్లను తినండి చాలు..
Immunity Booster Fruits: చలికాలంలో సాధారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటితో బాధపడుతుంటారు. వాటిని నివారించేందుకు మీ ఆహారంలో సీజనల్ పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలం ఆహారంలో ఏయే పండ్లను తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
Updated on: Nov 16, 2021 | 9:56 PM

యాపిల్ : వింటర్ సీజన్‌లో యాపిల్ తప్పనిసరిగా తినాలి. ఎందుకంటే చలికాలంలో తక్కువ నీరు తాగుతాం. ఇలాంటి పరిస్థితిలో.. మలబద్ధకం సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. యాపిల్స్‌లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంతోపాటు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.

దానిమ్మ: శీతాకాలంలో చలి గాలి కారణంగా ప్రధానంగా కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారు దానిమ్మ పండు తింటే మంచిది. దానిమ్మపండులో ఉన్న విటమిన్ సి, విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు సాధారణ వ్యాధులను సైతం నివారించి పలు ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతాయి.

అత్తి పండ్లు : అత్తి పండ్లల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నివారించి.. శరీరానికి రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. సాధారణంగా చలికాలంలో వేడి, బాయిల్డ్, ఆయిల్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కావున పొటాషియం అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి.. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

నారింజ : శీతాకాలం పండ్లలో నారింజ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇవి రుచికగా ఉండటంతో పాటు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. నారింజ సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కావున రోగనిరోధక శక్తిని పెంచేందుకు నారింజను తినాలి.

సీతాఫలం : సీతాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శీతాకాలపు ఆహారంలో సీతాఫలాన్ని తప్పక చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులో విటమిన్-బి6 వంటి పోషకాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.





























