బంక లడ్డూల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వీటిని ఎక్కువగా బాలింతలకు ఇస్తూ ఉంటారు. ఇవి తింటే బాలింతలు బలంగా, దృఢంగా ఉంటారు. పాలు కూడా ఎక్కువగా పడతాయి. బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. బంక లడ్డు లేదా గోంద్ కతీరా లడ్డూ ప్రత్యేక రుచే వేరు. వీటిని ఎవరైనా తినవచ్చు. ఈ లడ్డూలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ అడిగి తింటారు. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి బలాన్ని ఇచ్చి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మరి పోషకాహారమైన బంక లడ్డూని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంద్ కతీరా, బాదం పప్పు, జీడిపప్పు, కిస్ మిస్, గసగసాలు, ఎండు ఖర్జూరం, యాలకుల పొడి, జాజికాయ పొడి, బెల్లం లేదా పంచదార పొడి, నెయ్యి.
ముందుగా ఒక కడాయిలో పావు కప్పు నెయ్యి వేసి వేయించుకోవాలి. అందులో గోంద్ కతీరా వేసి వేయించు కోవాలి. ఇది ఇప్పుడు బాగా పొంగుతుంది. వెంటనే ఒక పల్లెంలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బాదం, జీడిపప్పు, గసగసాలు కూడా వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి బాదం, జీడిపప్పు, గోంద్ కతీరా వేసి బరకగా మిక్సీ పట్టాలి. ఆ రత్వాత ఎండు ఖర్జూరం ముక్కలు, పంచదార లేదా బెల్లం పొడి వేసి మరోసారి మిక్సీ పట్టాలి.
మిక్సీ పట్టుకున్న పొడి అంతా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇందులో వేడి చేసుకున్న నెయ్యి వేసి అంతా కలిసేలా కలపాలి. చివరలో గసగసాలు, కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఉండల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఓ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇవి రెండు వారాల పాటు నిల్వ ఉంటాయి. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.