AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్స్ తెలిస్తే అవాక్కే..

మార్కెట్‌కు వెళ్లి చేపలు కొంటున్నారా? అయితే ఐస్‌లో పెట్టినవన్నీ తాజా చేపలే అనుకుంటే మీరు తీవ్రంగా మోసపోయినట్లే.. కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన చేపలను కెమికల్స్ చల్లి తాజాగా కనిపించేలా మార్కెట్లో అమ్మేస్తుంటారు. కానీ కేవలం చిన్న టెస్టులతో అప్పుడే పట్టిన తాజా చేప ఏదో, కుళ్లిపోతున్న పాత చేప ఏదో చిటికెలో కనిపెట్టేయవచ్చు. చేపలు కొనేముందు ఈ విషయాలు తెలియకపోతే మీ డబ్బే కాదు, ఆరోగ్యమూ గుల్లవుతుంది.

వార్నీ.. ఫ్రెష్ చేపలను గుర్తుపట్టడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్స్ తెలిస్తే అవాక్కే..
How To Identify Fresh Fish
Krishna S
|

Updated on: Aug 27, 2026 | 9:34 AM

Share

నాన్ వెజ్ ప్రియులకు చేపలంటే మహా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి సైతం ఎంతో మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె, మెదడు పనితీరు మెరుగవుతుంది. అయితే మార్కెట్‌కు వెళ్లి చేపలు కొనేటప్పుడు చాలా మందికి ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. ఏది అప్పుడే పట్టిన ఫ్రెష్ చేప? ఏది రోజులు గడిచిన పాత చేప? రసాయనాలతో నిల్వ ఉంచిన చేపలేవి? అనే విషయాలు తెలియక చాలామంది నాణ్యత లేని, పాడైపోయిన చేపలను కొని అనారోగ్యం పాలవుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఫ్రెష్ చేపలను ఇంటి తెచ్చుకోవచ్చు. అందులో ప్రధానంగా చేప నాణ్యతను తెలుసుకోవడానికి మొదటిగా దాని కళ్లను నిశితంగా పరిశీలించాలి. తాజా చేప కళ్లు స్పష్టంగా, మెరుస్తూ, కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటాయి. ఒకవేళ కళ్లు లోపలికి కుంగిపోయి, కాంతిహీనంగా మారి, వాటిపై తెల్లటి పొర లేదా రక్తపు రంగు కనిపిస్తే ఆ చేపను పట్టి చాలా రోజులైందని గుర్తించాలి. అటువంటి చేపలను కొనుగోలు చేయకపోవడమే మంచిది.

మాంసం గట్టిదనం

చేతి వేలితో చేప మాంసాన్ని సున్నితంగా నొక్కి చూడాలి. చేప తాజాగా ఉంటే, వేలిని తీయగానే నొక్కిన భాగం వెంటనేసాధారణ ఆకృతికి వచ్చేస్తుంది. ఒకవేళ నొక్కిన చోట గుంట అలాగే ఉండిపోయినా లేదా మాంసం మెత్తబడి, చేతికి వదులుగా తగిలినా ఆ చేప పాడైపోయిందని భావించాలి.

చేపల వాసన

అప్పుడే పట్టిన లేదా తాజా చేపలకు సముద్రపు నీరు లేదా సహజమైన తేలికపాటి వాసన మాత్రమే ఉంటుంది. దీనికి భిన్నంగా అమ్మోనియా వాసన గానీ, ఘాటైన రసాయనాల వాసన గానీ, కుళ్ళిన దుర్వాసన గానీ వస్తే ఆ చేపలు నిల్వ ఉంచినవని స్పష్టమవుతుంది. అలాంటి చేపలను వండటం ఆరోగ్యానికి తీవ్ర హానికరం.

మొప్పల రంగు

చేప తల భాగంలోని మొప్పలను కొద్దిగా తెరిచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటేనే ఆ చేప తాజాదని అర్థం. అవి ముదురు గోధుమ, నలుపు లేదా బూడిద రంగులోకి మారితే, ఆ చేపలను ఫ్రీజర్‌లో లేదా రసాయనాలలో ఎక్కువ కాలం నిల్వ చేశారని నిర్ధారించుకోవచ్చు.

చేప చర్మం, పొలుసులు

తాజా చేప చర్మం సహజ మెరుపుతో ఉంటుంది. లుసులు చర్మానికి చాలా గట్టిగా అతుక్కుని ఉంటాయి. చర్మం రంగు వెలిసిపోయి, పొలుసులు వేలితో తాకగానే ఊడిపోతుంటే ఆ చేప నిల్వ కాలం ముగిసిందని గుర్తించాలి. చేపలు కొనేటప్పుడు కేవలం ధరను మాత్రమే కాకుండా ఈ టెస్టులు చేస్తే నాణ్యమైన, రుచికరమైన చేపలను ఈజీగా ఎంచుకోవచ్చు.

Follow Us