ఒంటికి చలువ.. ఎముకలకు బలం.. 5 నిమిషాల్లోనే పవర్‌ఫుల్ డ్రింక్ రెడీ.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, తక్షణ శక్తిని పొందడానికి రాగి జావ ఒక అద్భుతమైన పానీయం. ఇది ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్‌లతో నిండి ఉంటుంది, ఇది సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. రాగి జావ తయారుచేయడానికి ఎలాంటి పద్దతులను అనుసరించాలో తెలుసుకుందాం..

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, అలసటను దూరం చేయడానికి ఒక ఆరోగ్యకరమైన, పోషకమైన పానీయం అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి రాగి జావ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కేవలం వేసవి ప్రత్యేకమే కాదు, రోజువారీ పోషకాహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా తక్షణ శక్తిని అందిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రాగిలో ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని ప్రోటీన్ షేక్‌గా కూడా పరిగణించవచ్చు.. రాగులు (Finger Millet) కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, ముఖ్యమైన ఖనిజాలతో నిండిన అత్యంత పోషకమైన చిరుధాన్యం.. ఇవి ఎముకల బలానికి, మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తాయని.. అంతేకాకుండా శరీరంలోని వేడి తగ్గించేందుకు చల్లగా ఉంచేందుకు సహాయపడతాయని డైటీషియన్లు చెబుతున్నారు. అందుకే… రాగి జావను రెగ్యులర్ గా తాగడం చాలా మంచిది.
రాగి జావ తయారీకి కావలసినవి:
నీరు, ఇన్‌స్టంట్ రాగి పిండి, ఉప్పు, మజ్జిగ తగినంత, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, కొత్తిమీర .. కావాలంటే.. ఇవన్నీ లేకుండా రాగి జావ లో పాలను కలుపుకోవచ్చు..
తయారీ విధానం:
నీటిని సిద్ధం చేయడం: ఒక గిన్నెలో సరిపడేంతగా నీటిని తీసుకోవాలి. నీటిని స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై బాగా మరిగించాలి.
రాగి పిండి మిశ్రమం: ముందుగా నీటిలో కొంచెం ఇన్‌స్టంట్ రాగి పిండిని కలపాలి. గడ్డలు లేకుండా ఉండేలా స్పూన్ సహాయంతో బాగా చిలుకాలి. ఇన్‌స్టంట్ రాగి పిండి మార్కెట్‌లో సులభంగా లభిస్తుంది. లేదంటే, రాగులను ఇంటి వద్దే పొడి చేసి వాడుకోవచ్చు.
రాగి జావను ఉడికించడం: నీరు బాగా మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుతూ మరుగుతున్న నీటిలోకి పోయాలి. ఉండలు కట్టకుండా నిరంతరం గరిటెతో తిప్పుతూ ఉండాలి.
మిశ్రమం కలిపిన తర్వాత, సరిపడినంతగా ఉప్పు చేర్చాలి. రుచికి తగ్గట్టు ఉప్పును సర్దుబాటు చేసుకోవచ్చు. మీడియం మంటపై కాసేపు తిప్పుతూ ఉండటం ముఖ్యం. ఇది చిక్కగా మారితే చాలు..
రాగి జావ చల్లారే లోపు మజ్జిగను సిద్ధం చేసుకోవాలి. మజ్జిగతో రాగి జావ తాగడం వల్ల శరీరానికి మరింత చలువ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలు ఇష్టపడే వారు పాలను కూడా వాడుకోవచ్చు.
చల్లారిన రాగి మిశ్రమంలో మజ్జిగ పోసి కలిసిపోయే వరకు తిప్పాలి.
జావలో కావాలంటే ఫ్రెష్ బట్టర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, కొత్తిమీర కలుపుకోని తాగవచ్చు.
రాగి జావలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. ఇది తక్షణ శక్తిని అందించడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. పిల్లలు, పెద్దలకు ఇది ఒక మంచి పోషకాహారం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
