Idli: షుగర్ కంట్రోల్ చేసే ఇడ్లీలు.. వీటిని ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదలిపెట్టరు..
ఎలాంటి వారికైనా టేస్టీగా ఉంటూనే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది ఇడ్లీనే. ఇందులో పోషకాలతో పాటుగా ఆవిరి మీద చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి మరిన్ని పోషక విలువను యాడ్ చేస్తూ ఇడ్లీ రుచిని రెట్టింపు చేసుకునే మార్గం ఒకటుంది. ఈ సారి రొటీన్ గా ఇడ్లీలు చేసే బదులు మీ ఇంట్లో వాళ్లకి ఈ స్పెషల్ రెసిపీని చేసి పెట్టండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్న వారైనా వీటిని ఈజీగా లాగించేయొచ్చు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ రోజుల్లో జబ్బులకు భయపడి ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారం వైపే మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా చిరుధాన్యాలతో చేసే ఫుడ్స్ కు అటు హోటల్స్ తో పాటు ఇళ్లలోనూ మంచి డిమండే ఉంటోంది. అందులో జొన్నలతో చేసే ఇడ్లీ కూడా ఒకటి. రొటీన్ గా ఎప్పుడూ చేసుకునేవే కాకుండా ఇలా కొత్తగా ఓసారి ట్రై చేసి చూడండి. ఇప్పటికే వివిధ రకాల జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి డయాబెటిస్, అధిక బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఈ జొన్న ఇడ్లీలు బెస్ట్ ఆప్షన్. ఇవి ఆరోగ్యంతో పాటు రుచిలోనూ అద్భుతంగా ఉంటాయి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరే చూడండి..
జొన్న ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు:
జొన్న రవ్వ – మూడు కప్పులు
మినప్పప్పు – ఒక కప్పు
నీరు – సరిపడినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
జొన్న ఇడ్లీ రెసిపీ
తయారీ విధానం..
1. మినప్పప్పును శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వకు బదులుగా జొన్న రవ్వను తీసుకోవాలి. దీన్ని కూడా కడిగి ఒక ఆరు గంటల పాటు నాననివ్వాలి.
2. మినప్పప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఆ పిండిని జొన్న రవ్వలో వేసి బాగా కలపాలి.
4. జొన్న రవ్వ, మినప పిండిని బాగా కలిపి రాత్రంతా వదిలేయాలి.
5. ఇది పులిసి ఇడ్లీలు చక్కగా వస్తాయి.
6. ఉదయం లేచాక ఈ పిండిలో ఉప్పు కలుపుకోవాలి.
7. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో జొన్న ఇడ్లీలను పెట్టుకోవాలి.
8. పావుగంటలో జొన్న ఇడ్లీలు రెడీ అయిపోతాయి.
9. వీటిని కాంబినేషన్ గా పల్లీ, కొబ్బరి, టొమాటోలతో చేసిన చట్నీలను వాడుకోవచ్చు.
జొన్నలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
తప్పకుండా తినాల్సిన చిరుధాన్యాలలో జొన్నలు ఒకటి. ఇవి తక్కువ గ్లైసెమిక్‌ని కలిగి ఉంటాయి. మధుమేహం కలిగి ఉన్నవారు తమ శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకుంటే జొన్నలు బెస్ట్ ఆప్షన్. జొన్నలను భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌లో వచ్చే స్పైక్‌లు, క్రాష్‌లను నివారించవచ్చు. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినడం వల్ల రోజంతా మనుషులు చురుగ్గా ఉంటారు.