Hyderabad Street Food: ఈ అదిరిపోయే హైదరాబాదీ రుచులను మీరు రుచి చూశారా.. లేకుంటే చాలా మిస్ అవుతున్నట్లే..
Hyderabad Famous Street Food: హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించకపోతే.. మీరు హైదరాబాద్ ట్రిప్ పూర్తి అయినట్లుగా చెప్పలేము. హైదరాబాద్‌లోని కొన్ని ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్ గురించి..
హైదరాబాద్ (Hyderabad) అంటే ముందుగా గుర్తొచ్చే వంటకం బిర్యానీ. ఆ తర్వాత హలీమ్. కానీ హైదరాబాద్ అంటే ఈ రెండు వంటకాలే కాదు.. భాగ్యనగరంలో చాలా ప్రత్యేకమైన వంటలు ఎన్నో ఉన్నాయి.. వాటి రుచి కూడా అంతకంటే అద్భుతం అని చెప్పవచ్చు. రుచి విషయంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ పుట్టిన ఎన్నో వంటకాలు(dishes) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఆహార ప్రియుల మనసులను దోచుకుంటున్నాయి. హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించకపోతే.. మీరు హైదరాబాద్ ట్రిప్ పూర్తి అయినట్లుగా చెప్పలేము. హైదరాబాద్‌లోని కొన్ని ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇది దాని ఆకర్షణీయమైన వాసన, రుచి కారణంగా పర్యాటకులను మళ్లీ మళ్లీ హైదరాబాద్ వచ్చేలా.. తినేలా చేస్తాయి. కాబట్టి నోరూరించే ఈ వంటల గురించి కూడా మనం తెలుసుకుందాం.
బోటీ కబాబ్
బోటీ కబాబ్ హైదరాబాద్‌కు ప్రాణం. ఈ ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హైదరాబాదీ ప్రజలలో ప్రసిద్ధి చెందింది. అలాగే దాని అద్భుతమైన రుచి.. ఆకృతి కారణంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులను మళ్లీ ఇక్కడికి రావాలని బలవంతం చేస్తుంది. బోటి కబాబ్‌లు తోట నుంచి తెచ్చిన తాజా మూలికలతో పాటు.. మేక పొట్టేలు మాంసంతో తయారు చేస్తారు. మటన్‌కు మసాలలు జోడించి చాలా ప్రత్యేకంగా తాయారు చేస్తారు. ఇది దాని రుచిని మరింత అద్భుతంగా చేస్తుంది.
మిర్చి కా సలాన్
మిర్చి కా సలాన్ ఒక రకమైన గ్రేవీ డిష్. కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు, పచ్చిమిర్చి ఈ వంటకానికి ప్రాణం. మీరు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడేవారైతే.. ఖచ్చితంగా ఈ వంటకాన్ని ఒకసారి ప్రయత్నించండి. తాజా కొబ్బరి పేస్ట్ ఈ వంటకానికి అద్భుతమైన రుచిని జోడిస్తుంది. బిర్యాణీతో సైడ్ డిస్‌లా దీనిని అందిస్తుంటారు.
కీమా సమోసా..
మనకు ఆనియన్ సమోసా.. ఆలూ సమోసా తిని ఉంటాం. కానీ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే దొరికే ఈ కీమా సమోసా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్పైసీ మసాలాలు, చాలా చిన్న ముక్కలు చేసిన మేక పొట్టేలు మాంసంతో తయారుచేస్తారు. హైదరాబాద్ వీధుల్లో ఇది చాలా రుచికరమైన స్నాక్.
కుబానీ కా మీఠా
హైదరాబాద్ అంటే నాన్ వెజ్ మాత్రమే కాదండోయో.. ఇక్కడ నోరూరించే స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా ప్రత్యేకమైనది కుబానీ కా మీఠా. హైదరాబాద్‌లో ఇది చాలా స్పెషల్ స్వీట్ అని చెప్పాలి. ఇందులో డ్రై ఆప్రికాట్లను ఉపయోగిస్తారు. దీనితో పాటు, బాదం కూడా ఇందులో ఉపయోగిస్తారు. ఈ వంటకం ఐస్ క్రీమ్‌తో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది.
డబల్ కా మీఠా
ఈ డిష్ ఖచ్చితంగా హైదరాబాద్‌లో జరిగే అన్ని వేడుకల్లో తప్పకుండా వడ్డిస్తుంటారు. ఇది ఒక రకమైన బ్రెడ్ పుడ్డింగ్, దీనిలో బ్రెడ్ ముక్కలను కుంకుమపువ్వు, యాలకులు కలిపిన పాలలో నానబెట్టాలి. దాని తరువాత రోస్ట్ చేస్తారు. ఇలా తయారు చేసిన తర్వాత ఇది అదిరిపోయే రుచిని ఇస్తుంది.