పాకం పట్టే పని లేదు.. అద్దిరిపోయే స్వీట్.. నిమిషాల్లోనే అద్దిరిపోయే స్వీట్
దీపావళి పండుగకు లక్ష్మీదేవికి ప్రత్యేక నైవేద్యంగా బెల్లం పొంగడాలు తయారు చేయాలనుకుంటున్నారా? పాకం పట్టే పని లేకుండా బియ్యం, బెల్లం, కొబ్బరి, నువ్వులతో ఎంతో సులభంగా ఈ స్వీట్ చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే బెల్లం పొంగడాల తయారీ విధానం తెలుసుకోండి.

పండుగ రోజుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించడం మన ఆచారం.. అందులోనూ దీపావళి వేళ లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాలను తయారు చేయడం ప్రత్యేకత.. పాకం పట్టే పని లేకుండా, తడిపిండి దంచే శ్రమ లేకుండా.. అతి తక్కువ సమయంలో ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ‘బెల్లం పొంగడాలు’ ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. దీని ప్రకారం ఈజీగా రుచికరమైన బెల్లం పొంగడాలు తయారు చేసుకోవచ్చు..
కావాల్సిన పదార్థాలు:
- బియ్యం: 2 కప్పులు (రెగ్యులర్ బియ్యం లేదా రేషన్ బియ్యం)
- బెల్లం తురుము: 2 కప్పులు
- గోధుమ పిండి: 4 స్పూన్లు (పావు కప్పు)
- ఎండు కొబ్బరి ముక్కలు: అర కప్పు (చిన్న ముక్కలుగా తరిగినవి)
- నువ్వులు: 1 టేబుల్ స్పూన్
- యాలకులు: 4 లేదా యాలకుల పొడి తగినంత
- వంట సోడా: చిటికెడు (1/3 టీస్పూన్)
- నెయ్యి – నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం – సులభమైన పద్ధతి:
బియ్యం నానబెట్టడం: ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి, రాత్రంతా లేదా సుమారు 10 నుంచి 15 గంటల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి (ఎక్కువ సేపు నానితే మధ్యలో నీళ్లు మర్చడం మంచిది).
పిండి రుబ్బుకోవడం: నానిన బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసి, వీలైనంత మెత్తగా, కొద్దిగా గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి (మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి).
బెల్లం కలపడం: గ్రైండ్ చేసిన పిండిలో రెండు కప్పుల తురిమిన బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, పావు కప్పు గోధుమ పిండిని కలపాలి (పిండి కన్సిస్టెన్సీ గరిటె జారుడుగా ఉండాలి).
పోపు దినుసులు: స్టవ్ మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు, నువ్వులను దోరగా వేయించి పిండిలో కలపాలి. చివరగా యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
నానబెట్టడం: ఈ పిండిని మూతపెట్టి 3 నుండి 4 గంటల పాటు నాననివ్వాలి. ఆ తర్వాత చిటికెడు వంట సోడా, కొద్దిగా నీళ్లు లేదా పిండి అవసరమైతే కలుపుకోవాలి.
పొంగడాలు వేయించుట: స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేగాక, గుంట గరిటెతో పిండిని తీసుకుని కాగిన నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, పైనుంచి నూనె వేస్తూ రెండు వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి.
అంచులు క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన బెల్లం పొంగడాలు సిద్ధం.. పండగ వేళ లక్ష్మీదేవికి ఎంతో నివేద్యంగా సమర్పించే ఈ వంటకాన్ని మీరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
