AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పిన్ని ఇంట్లో కన్నం వేయమని ఫ్రెండే చెప్పింది.. ఈ కథ సినిమాకు ఏం తక్కువ కాదు..

కుటుంబ రహస్యాలు చేరవేసి, పిన్ని ఇంటి బంగారం దొంగతనానికి పథకం వేసిన యువతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. 75 లక్షల విలువైన బంగారాన్ని చోరీ చేసేందుకు స్నేహితుడు చంద్రశేఖర్‌కు సహాయం చేసింది. ప్లాన్ బెడిసికొట్టడంతో పోలీసులు కేసును ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశారు.

Hyderabad:  పిన్ని ఇంట్లో కన్నం వేయమని ఫ్రెండే చెప్పింది.. ఈ కథ సినిమాకు ఏం తక్కువ కాదు..
Hyderabad Gold Theft
Ram Naramaneni
|

Updated on: Nov 07, 2026 | 12:11 PM

Share

“ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు” అనే పాత సామెతను ప్రస్తుతం కాలంలో పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటి రహస్యాలను ఎవరికీ తెలియకుండా దాయలేని రోజులు వచ్చాయి. బంధువుల అమ్మాయే కదా అని నమ్మి ఇంట చోటు ఇచ్చిన పిన్నికి చేదు అనుభవం ఎదురైంది. తన స్నేహితుడితో కలిసి ఇంట్లో ఉన్న 75 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేసేందుకు పథకం వేసింది. అయితే, ఈ పథకం బెడిసికొట్టి, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నిజాంపేట్‌లో నివసించే చంద్రశేఖర్, హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అతను సహాయం కోరుతూ తన కాలేజ్ ఫ్రెండ్‌ను సంప్రదించాడు. చంద్రశేఖర్ స్నేహితురాలు పద్మావతి అనే ఆమెకు బంధువు. పద్మావతి ఇంట్లో చాలా బంగారం ఉందని, దానిని దొంగిలిస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయని చంద్రశేఖర్‌కు సలహా ఇచ్చింది. అంతేకాకుండా, దొంగతనానికి పక్కాగా ప్లాన్ వేసింది.

ఈ యువతి తన పిన్ని పద్మావతి ఇంటి తాళాలను చంద్రశేఖర్‌కు ఇచ్చింది. వాటిని ఉపయోగించి చంద్రశేఖర్ నకిలీ తాళాలను తయారు చేసుకున్నాడు. అనంతరం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, తన స్నేహితుడు షాజీ సాయంతో నకిలీ తాళాలతో పద్మావతి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, బీరువాలోని బంగారు నగలు, వెండి సామాగ్రిని అపహరించారు. పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఫిర్యాదులో మొదట 42 తులాల బంగారం, దాదాపు 3 కిలోల వెండి పోయిందని పేర్కొన్నారు. అయితే, దర్యాప్తులో 52 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.

పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి చోరీకి పాల్పడిన నిందితుడిని చంద్రశేఖర్‌గా గుర్తించారు. అతను నిజాంపేట ఏరియాలో నివాసం ఉంటున్నట్లు తేలింది. చోరీ చేసిన తర్వాత చంద్రశేఖర్ గుంటూరులో 13 తులాల బంగారాన్ని, చార్మినార్ వద్ద 25 తులాల బంగారాన్ని సుమారు 25 లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నిందితుడు తిరుమలగిరిలో ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ నుంచి మరో 42 తులాల బంగారు నగలు, 27 తులాల వెండి సామాగ్రి, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళం ఎలా వచ్చిందని ప్రశ్నించగా, పద్మావతి బంధువుల అమ్మాయి (చంద్రశేఖర్ స్నేహితురాలు) ఒక నెల రోజుల క్రితం ఒక రోజు తాళం ఇచ్చిందని, ఆర్థిక ఇబ్బందులున్నాయని, బంగారం తీసుకుని రెండు, మూడు నెలల్లో తిరిగి పెట్టేస్తానని నమ్మబలకడంతో ఆమె అమాయకంగా ఇచ్చిందని వెల్లడించాడు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేయగా, అతనికి సహకరించిన షాజీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీసులు షాజీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన బంధుత్వాలను, నమ్మకాలను దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతున్న తీరును తెలియజేస్తుంది.

Follow Us