AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. చివరకు మంచి నీళ్లతో కడుపు నింపుకుని.. అనాథగా రోడ్డు మీద మరణించిన నటుడు..

తెలుగు సినిమా చరిత్రలో కస్తూరి శివరావు ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మొదటితరం హాస్య నటుడు. అప్పట్లో స్టార్ కమెడియన్‌గా ఆయన పేరు మార్మోగిపోయింది. ఆయన ఇంటి ముందు కార్లు బారులు తీరేవి, దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టేవారు. హీరోల కంటే ఎక్కువగా పారితోషికం అందుకున్న మొట్టమొదటి నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. నాటి ప్రధాని నెహ్రూ సైతం ఆయన సంతకం ఉంటేనే సినిమా ఫంక్షన్లకు వస్తానని చెప్పిన సందర్భాలు ఆయన స్టార్‌డమ్‌కు నిదర్శనం.

స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్.. చివరకు మంచి నీళ్లతో కడుపు నింపుకుని.. అనాథగా రోడ్డు మీద మరణించిన నటుడు..
Kasturi Siva Rao
Rajitha Chanti
|

Updated on: Nov 07, 2026 | 12:26 PM

Share

దివంగత నటుడు కస్తూరి శివరావు. ఇప్పటితరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకనాటి తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా వెలుగొందిన మహానటుడు. ఆయన కీర్తి, ప్రతిష్టలు ఆనాటి హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేవి. ఆయన ఇంటి ముందు కార్లు బారులు తీరేవి, ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూసేవారు. కనీసం హీరోల కంటే అధిక పారితోషికం తీసుకున్న మొట్టమొదటి నటుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. కొన్ని సందర్భాల్లో హీరోల కంటే ఎక్కువగా తన పేరును టైటిల్స్ లో వేయించుకున్న ఘనత కూడా ఆయనదే. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సైతం ఆయన సంతకం ఉంటేనే సినిమా ఫంక్షన్లకు వస్తానని పట్టుబట్టిన ఉదాహరణలు ఆయన స్థాయిని తెలియజేస్తాయి. అయితే, ఇంతటి అపారమైన కీర్తి ప్రతిష్టలు, ధనం సంపాదించిన శివరావు జీవితం మాత్రం అత్యంత విషాదకరంగా ముగిసింది. 1913 మార్చి 6వ తేదీన కాకినాడ దగ్గర రెబల్ అనే గ్రామంలో కస్తూరి శివరావు జన్మించారు. ఆయనది పేద కుటుంబం. తండ్రి గుమస్తాగా పనిచేసేవారు. శివరావుకు చదువు మీద కంటే నాటకాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. ఊరిలో జరిగే నాటకాల్లో పాల్గొంటూ, ఒకానొక సందర్భంలో నాటకాల పిచ్చితో స్కూల్‌కు వెళ్లడం మానేశారు. తండ్రి మందలించిన ప్రతిసారీ ఇంట్లో నుంచి పారిపోయి నాటక కంపెనీలో చేరడం, కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇంటికి రావడం, మళ్లీ వెళ్ళిపోవడం ఇదే తంతుగా మారింది. ఈ క్రమంలోనే ఆయన ఒక నాటక కంపెనీలో చేరి దేశమంతా తిరిగారు. నాటకరంగంలో ఆయన అనుభవం అపారంగా పెరిగింది.

ఆయన నటన ప్రతిభ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం దృష్టిలో పడింది. అప్పటికే శివరావు నాటకాలను చూసిన రామబ్రహ్మం, ఆయనతో సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. ఆ విధంగానే 1940లో “వారాలబ్బాయి” సినిమాతో శివరావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ, నటుడిగా శివరావుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి గూడవల్లి దర్శకత్వంలోనే వచ్చిన “పంతులమ్మ” సినిమాతో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆయన పంతులమ్మ దగ్గర చదువుకునే వయసు మళ్ళిన విద్యార్థిగా నటించి, తన సహజ నటనతో అందరినీ అలరించారు. అప్పటి నుండి ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతి సినిమాలోనూ హీరోతో సమానంగా, కొన్ని సందర్భాల్లో ఆయన పాత్రనే ప్రధానంగా చేసుకుని సినిమాలు తీసేవారు. సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా శివరావు ఉండాల్సిందే అని నమ్మే దర్శక నిర్మాతలు కూడా ఉండేవారు. ఎల్.వి. ప్రసాద్, కె.వి. రెడ్డి వంటి మేటి దర్శకులు సైతం శివరావు కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారు. ఆయన డేట్స్ కు అనుగుణంగా సినిమా షెడ్యూల్స్ కూడా మార్చుకునేవారు. అంతటి స్టార్‌డమ్ అనుభవించారు శివరావు.

తన డిమాండ్‌కు తగ్గట్టుగానే ఆయన పారితోషికం కూడా తీసుకునేవారు. అయితే, శివరావులో ఒక మంచి గుణంతో పాటు ఒక చెడ్డ గుణం కూడా ఉండేది. ఆయనకు గుర్రపు పందాల వ్యసనం తీవ్రంగా ఉండేది. ఈ వ్యసనంతో ఆయన సంపాదించిన కోట్ల ఆస్తిని అంతా పోగొట్టుకున్నారు. పేకాట కూడా ఆడేవారని సన్నిహితులు చెబుతుంటారు. వచ్చిన డబ్బును వచ్చినట్టే ఖర్చు పెట్టేవారని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు అంటుంటారు. ఆయన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతో మంది దర్శక నిర్మాతలు సహాయం కోసం వచ్చేవారు. వాళ్లందరికీ లేదనకుండా సహాయం చేసేవారని చెబుతుంటారు. అయితే, ఆస్తులు పోగొట్టుకొని కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదని ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య సరోజిని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ ఆయన ఏనాడు ఎవరి దగ్గర చేయి చాచలేదని, తన ఆత్మాభిమానాన్ని ఎప్పుడు కూడా చంపుకోలేదని ఆమె అన్నారు.

ఒక దశలో ఆయనే సొంతంగా “పరమానందయ్య శిష్యుల కథ” పేరుతో ఒక సినిమాను కూడా ప్రారంభించారు. ఆ సినిమా కోసం ఆయన కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఆ సినిమా నిర్మాణం పూర్తి కాలేదు. ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కార్లలో తిరిగిన ఆయన చివరి రోజుల్లో బస్సుల్లో, రిక్షాల్లో ప్రయాణించేవారు. అంతేకాదు, ఒకప్పుడు స్టార్ హోటళ్లలో భోజనం చేసిన ఆయన, కొన్ని సందర్భాల్లో పచ్చి మంచినీళ్లతో కడుపు నింపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన భార్య చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడు కూడా శివరావును వదిలి వెళ్లలేదని, ఆయన మంచితనం వల్లే తాము అన్ని కష్టాలు అనుభవించామని ఆమె చెప్పారు. ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన శివరావు చివరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఆయన 1966 ఫిబ్రవరి 27వ తేదీన మరణించారు.

Follow Us