మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడు.. నటి అతుల్య చంద్ర సంచలన ఫిర్యాదు..
మలయాళ నటి అతుల్య చంద్ర ఓ వైద్యుడిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేయడంతో కొచ్చిన్ పోలీసులు డాక్టర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు, వైద్యుడిపై దాడి చేసి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారన్న కేసులో నటి సహా ముగ్గురు ఇప్పటికే అరెస్టయ్యారు. పరస్పర ఫిర్యాదులతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కొచ్చిన్ (కేరళ): అత్యవసర చికిత్స పేరుతో 41 ఏళ్ల వైద్యుడిని తమ ఫ్లాట్‌కు పిలిపించి, దాడికి పాల్పడి రూ.3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకున్నారన్న మలయాళ సినీ నటీనటుల కేసులో ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. తొలుత బాధితుడిగా పోలీసులను ఆశ్రయించిన సదరు డాక్టరుపైనే పోలీసులు తాజాగా అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నటి అతుల్య చంద్ర తరుపును ఆమె బంధువు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వైద్యుడిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
వైద్యం పేరుతో తరచూ తమ ఫ్లాట్‌కు వస్తున్న సదరు డాక్టర్ ప్రవర్తన సరిగా లేదని, ఆయన తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఆయన అక్రమ ప్రవర్తనకు తగిన బుద్ధి చెప్పాలనే ముందస్తు ప్రణాళికతోనే ఈ నెల 2వ తేదీన ఫోన్ చేసి, అత్యవసర వైద్యం కావాలని ఫ్లాట్‌కు రప్పించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందింటే..
వైద్యుడి ఫిర్యాదు ప్రకారం.. అత్యవసర చికిత్స కోసమని పిలిపించి ఫ్లాట్‌లో ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం ఆయన వద్ద ఉన్న మొబైల్ ఫోన్, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఇయర్ ఫోన్ల వంటి సుమారు రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను బలవంతంగా లాక్కున్నట్లు వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘మత్తు వదలరా’ సినిమా ఫేమ్ నటి అతుల్య చంద్ర, నటుడు-నిర్మాత బిబిన్ పెరుంబిల్లిలతో పాటు మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు.
పరారీలో మరో తొమ్మిది మంది నిందితులు:
ఈ దోపిడీ, దాడి వ్యవహారంలో మరో తొమ్మిది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ తొమ్మిది మంది నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ఒకే ఘటనపై ఇరువర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదులు చేసుకోవడంతో కొచ్చిన్ పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
