జీరోగాళ్ల కోసం ఆ ఇద్దరు హీరోలను వదిలేస్తారా.. సీఎస్కే ట్రేడ్‌పై మాజీ ఆటగాడి ఫైర్..!
ఐపీఎల్ 2027కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేసిన ట్రేడ్ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్‌లను వదులుకుని లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను తీసుకోవడంపై మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేసిన ఓ కీలక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత పేసర్ ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed), ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)లను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు పంపించి, వారి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone), ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards)లను జట్టులోకి తీసుకుంది. అయితే సీఎస్కే చేసిన ఈ ట్రేడ్ సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జట్టులో రెగ్యులర్‌గా ఆడే ఇద్దరు బౌలర్లను వదులుకోవడం వల్ల బౌలింగ్ విభాగం బలహీనపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎస్కే నిర్ణయంపై బద్రీనాథ్ ఫైర్..
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మాజీ భారత క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ (Subramaniam Badrinath) ఈ ట్రేడ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ సీఎస్కే నిర్ణయాన్ని ప్రశ్నించారు.
“తుది జట్టులో ఆడే ఇద్దరు ఆటగాళ్లను వదిలేసి, అసలు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కని ఇద్దరిని తీసుకోవడం మంచి ట్రేడేనా? నా అభిప్రాయం ప్రకారం ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుతమైన డీల్” అని బద్రీనాథ్ వ్యాఖ్యానించారు.
ఖలీల్ అహ్మద్‌ను వదులుకోవడం పెద్ద తప్పా?
ఖలీల్ అహ్మద్ పవర్‌ప్లేలో బాగా బౌలింగ్ చేయగలడని బద్రీనాథ్ గుర్తుచేశారు. ముఖ్యంగా ఎడమచేతి వాటం పేసర్ కావడం అతడికి అదనపు బలమని చెప్పారు. భారత ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉండటం చాలా కష్టమని, అందులోనూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు మరింత అరుదుగా దొరుకుతారని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే బౌలింగ్ విభాగం సీఎస్కేకు బలహీనమైన అంశంగా ఉందని, అలాంటి సమయంలో ఖలీల్, ఎల్లిస్ ఇద్దరినీ వదులుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు.
లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌తో ప్రయోజనం ఉంటుందా?
లియామ్ లివింగ్‌స్టోన్ మంచి ఫినిషర్ అయినప్పటికీ అతడి గత ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేవని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో కూడా అతడికి స్థిరమైన చోటు దక్కలేదని గుర్తుచేశారు. మరోవైపు జాక్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడగలడని పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ లాభమా?
ఈ ట్రేడ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ ప్రయోజనం పొందిందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ ద్వారా టీ నటరాజన్‌ను కూడా జట్టులోకి తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్ పేస్ విభాగాన్ని బలోపేతం చేసుకుంటోంది.
మొత్తంగా ఈ ఒప్పందంపై బద్రీనాథ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది సూపర్ ట్రేడ్ అయితే, సీఎస్కేకు మాత్రం 50-50 డీల్ అని పేర్కొన్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఈ ట్రేడ్ ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
