AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై ఇండియన్స్‌గా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

ముంబై కా రాజా మళ్లీ తన సింహాసనాన్ని అధిష్టించాడు. ఐపీఎల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ శుభవార్త వచ్చేసింది. మూడు సీజన్ల విరామం తర్వాత, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్‌గా నియమితులయ్యాడు. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అవ్వడం, కొత్త హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై శిబిరంలో ఒక్కసారిగా పాత జోష్ మొదలైంది.

ముంబై ఇండియన్స్‌గా కెప్టెన్‌గా రోహిత్ శర్మ
Rohit Sharma Mumbai Indians Captain
Krishna S
|

Updated on: Nov 27, 2026 | 6:03 PM

Share

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ తన పాత సింహాసనాన్ని అధిష్టించాడు. మూడు సీజన్ల విరామం తర్వాత, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2027 సీజన్‌లో హార్దిక్ పాండ్యా స్థానంలో 39 ఏళ్ల రోహిత్ శర్మ ముంబై జట్టును నడిపించనున్నాడు. ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అర్ష్‌దీప్ సింగ్‌తో కూడిన ట్రేడ్ డీల్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు మారడంతో, రోహిత్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా పేర్లను కూడా పరిశీలించినప్పటికీ, చివరకు తమ అత్యంత విజయవంతమైన సారథికే ముంబై యాజమాన్యం ఓటు వేసింది.

గత మూడేళ్ల ఒడిదుడుకులు.. అభిమానుల ఆగ్రహం

2013లో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ 2024 వరకు జట్టును నడిపించాడు. అయితే 2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2024లో వాంఖడే స్టేడియంలోనే హార్దిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి, ఆ సీజన్‌లో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2025లో ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ, 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలో నిలవడం జట్టు యాజమాన్యాన్ని పునరాలోచనలో పడేసింది. 2020 తర్వాత ముంబై ఒక్కసారి కూడా ఫైనల్ చేరకపోవడం గమనార్హం.

సపోర్ట్ స్టాఫ్‌లోనూ భారీ మార్పులు

రోహిత్ పునరాగమనంతో పాటు ముంబై ఇండియన్స్ కోచింగ్ బృందంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించగా, రాబిన్ ఉతప్ప, మిచెల్ మెక్‌క్లెనగన్ వంటి మాజీ ఆటగాళ్లను సహాయక సిబ్బందిలో కీలక బాధ్యతల్లోకి తీసుకున్నారు.

ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుత రికార్డు

5 ఐపీఎల్ టైటిళ్లు: 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు.

మ్యాచ్‌లు – విజయాలు: తన తొలి విడత కెప్టెన్సీలో 163 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 91 విజయాలు అందించాడు.

గెలుపు శాతం: కెప్టెన్‌గా రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 57.05గా ఉంది.

ముంబై కెప్టెన్సీలో సాధించిన విజయాలే రోహిత్‌ను టీమిండియా ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా ఎదిగేలా చేశాయి. ఆయన సారథ్యంలోనే భారత్ టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిళ్లను కైవసం చేసుకుంది.

Follow Us