AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: టీమిండియా ఎంట్రీ పై ఆశలు వదిలేసుకున్న షమీ.. ఇక తన ఫోకస్ అంతా అక్కడే

Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ అంతర్జాతీయ పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉన్నాడు. ప్రస్తుతం బెంగాల్ జట్టు, ఐపీఎల్‌లో ఆడటంపైనే దృష్టి పెట్టాడు.

Mohammed Shami: టీమిండియా ఎంట్రీ పై ఆశలు వదిలేసుకున్న షమీ.. ఇక తన ఫోకస్ అంతా అక్కడే
Mohammed Shami Test Retirement
Rakesh
|

Updated on: Nov 27, 2026 | 6:45 PM

Share

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోకి తిరిగి రావడం, వచ్చే ప్రపంచకప్‌లలో ఆడటం గురించి ఇప్పుడు ఎక్కువగా ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. తన ఆటపై దృష్టి పెట్టి, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ బెంగాల్ జట్టు తరఫున, ఐపీఎల్‌లో ఆడటమే ప్రస్తుత లక్ష్యమని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ఉందా? అని ముంబైలో విలేకరులు అడగ్గా.. ఈ విషయాల గురించి ఆలోచించడం మానేశానని బదులిచ్చాడు. సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదేనని పేర్కొన్నాడు.

టెస్టులకు రిటైర్మెంట్

షమీ ఈ నెల 6న టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకలేదు. వన్డేలు, టీ20ల్లో ఆడేందుకు అందుబాటులో ఉన్నాడు. టెస్టుల్లో 64 మ్యాచ్‌లు ఆడిన షమీ 229 వికెట్లు పడగొట్టాడు. ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 2013లో వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. అదే ఏడాది నవంబర్ 6న తన టెస్టు ప్రయాణానికి ముగింపు పలికాడు. శరీరంపై ఎక్కువ భారం పడకుండా వైట్‌బాల్ క్రికెట్‌ను స్వేచ్ఛగా ఆడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

టీమిండియాలో చోటేది?

2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీకి టీమిండియాలో మళ్లీ అవకాశం రాలేదు. ఆ టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున ఆడుతూ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. రంజీ ట్రోఫీలో సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అయినప్పటికీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం మాత్రం దక్కలేదు.

టెస్టులకు ఎందుకు గుడ్‌బై చెప్పాడంటే?

టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం శారీరక ఒత్తిడేనని షమీ వివరించాడు. ఎక్కువ భారం తీసుకుంటే శరీరంపై ప్రభావం పడుతుందని, వైట్‌బాల్ క్రికెట్‌ను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలని భావించినట్లు చెప్పాడు. ప్రస్తుతం తాను బాగానే కదలగలుగుతున్నానని, క్రికెట్ ఆడగలుగుతున్నానని తెలిపాడు. అందుకే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినందుకు ఎలాంటి బాధ లేదని కూడా స్పష్టం చేశాడు. అవసరమైతే ఫిట్‌నెస్ కోసం ఎరుపు బంతితోనూ ఆడతానని చెప్పడం మరో ఆసక్తికర విషయం.

యంగ్ ప్లేయర్లు అనుభవం పంచడమే మరో లక్ష్యం

క్రికెట్‌పై ఇష్టం ఉన్నంతకాలం ఆడుతూనే ఉండాలని షమీ అభిప్రాయపడ్డాడు. బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. వచ్చే నెల జరిగే విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు తనకు నచ్చిన మ్యాచ్‌లను ఎంచుకుని ఆడే వెసులుబాటు ఉందని, ఫిట్‌నెస్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. మొత్తానికి టీమిండియా పిలుపు కోసం ఎదురుచూడకుండా.. తన ఆటను ఆస్వాదిస్తూ బెంగాల్, ఐపీఎల్‌లో కొనసాగడంపైనే షమీ దృష్టి పెట్టాడు. మరి అతడి ప్రదర్శనతో మళ్లీ భారత జట్టులోకి వస్తాడా? అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us