AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్!

విదేశాల్లో ఉద్యోగాలు సాధించే నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 19న జీవో నంబర్ 19 జారీ చేసింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయనుంది.

విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు గుడ్‌న్యూస్.. తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్!
Cm Overseas Employment SchemeImage Credit source: AI Image
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 27, 2026 | 6:24 PM

Share

విదేశాల్లో ఉద్యోగాలు సాధించే నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకాన్ని (Chief Minister’s Overseas Employment Scheme) ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 19న జీవో నంబర్ 19 జారీ చేసింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయనుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ పథకం వర్తిస్తుంది.

విదేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు, వృత్తి విద్య పూర్తి చేసిన వారికి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. అవగాహన లేకపోవడం, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు కావడంతో పేద కుటుంబాలకు చెందిన యువత ఈ అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. విదేశీ భాషల్లో శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాల పెంపు, ఉద్యోగాలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు టామ్‌కామ్ సహకరిస్తుంది. సురక్షితంగా, చట్టబద్ధంగా విదేశాల్లో ఉద్యోగాల్లో చేరేందుకు తోడ్పాటు అందిస్తుంది.

తొలి ఏడాది 7 వేల మందికి సాయం

2026–27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేరుగా విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే 5,880 మందికి, విదేశీ భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే 1,120 మందికి ఆర్థిక సాయం అందిస్తుంది. అభ్యర్థుల ఆసక్తి, విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు, విదేశాల్లో ఉద్యోగావకాశాలను బట్టి కేటగిరీలను నిర్ధారిస్తారు.

రెండు కేటగిరీల్లో సబ్సిడీ

విదేశీ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించారు. విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ, పరీక్షలు అవసరం లేకుండా నేరుగా ఉద్యోగాలకు వెళ్లే వారిని మొదటి కేటగిరీలో చేర్చారు. వీరికి వీసా, విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం గరిష్ఠంగా రూ.లక్ష వరకు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.50 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.

ఆయా దేశాల భాషల్లో ప్రావీణ్యం అవసరమైన ఉద్యోగాలకు వెళ్లే వారిని రెండో కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో గరిష్ఠంగా రూ.3.50 లక్షల వరకు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 50 శాతం.. గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది.

రెండు కేటగిరీల్లోనూ మిగతా 50 శాతం ఖర్చును అభ్యర్థులు భరించాలి. సొంతంగా డబ్బు సమకూర్చుకోలేని వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు ప్రత్యేక రుణ విధానాన్ని రూపొందించేందుకు టామ్‌కామ్ జాతీయ బ్యాంకులతో సమన్వయం చేసుకుంటుంది.

పది రంగాల్లో ఉద్యోగావకాశాలు

నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలు, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రవాణా, లాజిస్టిక్స్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, వైద్య సహాయక సేవలు, హోటళ్లు, పర్యాటకం, మరమ్మతులు, నిర్వహణ, గృహ, వ్యక్తిగత సేవల రంగాల్లో ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. విదేశీ ఉద్యోగ సంస్థలతో భాగస్వామ్యాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రభుత్వాల మధ్య కార్మిక ఉపాధి ఒప్పందాల ద్వారా ఉద్యోగావకాశాలను విస్తరించనున్నారు.

18 నుంచి 40 ఏండ్ల వయసు వారికి అవకాశం

అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా దేశాలు, ఉద్యోగ సంస్థల నిబంధనలను బట్టి వయోపరిమితిలో మార్పులు ఉంటాయి. అభ్యర్థులు తెలంగాణ స్థానికులై ఉండాలి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి. ఐటీఐ అర్హతతో ఉద్యోగాలకు వెళ్లే వారు తెలంగాణలోని గుర్తింపు పొందిన సంస్థల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితికి లోబడి ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వృత్తిలో కనీసం రెండేండ్ల పని అనుభవం ఉండాలి. ఆయా దేశాల వర్క్ వీసా నిబంధనలను బట్టి పని అనుభవం విషయంలో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే నాటికి పాస్‌పోర్టు గడువు కనీసం ఆరు నెలలు ఉండాలి. ఉద్యోగ సంస్థలు నిర్దేశించిన వైద్య పరీక్షల్లో అర్హత సాధించాలి.

కుటుంబంలో ఒక్కరికే సబ్సిడీ

రేషన్ కార్డు ఆధారంగా ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో మరెవరూ ఈ పథకం ద్వారా సబ్సిడీ పొందలేదని ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి లేదా మున్సిపల్ సిబ్బంది ధ్రువీకరించాలి. మొత్తం లబ్ధిదారుల్లో మహిళలకు కనీసం 33.33 శాతం, దివ్యాంగులకు కనీసం 5 శాతం కేటాయిస్తారు. తగినంత మంది అర్హులు లేకపోతే రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదంతో మిగిలిన అవకాశాలను ఇతర అర్హులకు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు

టామ్‌కామ్ ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు, పని అనుభవానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. అవసరమైన సందర్భాల్లో విదేశీ భాషా ప్రావీణ్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. అభ్యర్థుల బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానమై ఉండాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించరు.

30 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక

ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తుల ప్రాథమిక జాబితాను జిల్లా ఉపాధి కల్పన అధికారి రూపొందిస్తారు. ఆర్డీవో లేదా తహసీల్దార్ దరఖాస్తులను పరిశీలిస్తారు. అదనపు పత్రాలు అవసరమైతే అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. జిల్లాస్థాయి కమిటీ అర్హులను గుర్తించి రాష్ట్రస్థాయి కమిటీకి సిఫారసు చేస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీ తుది జాబితాను ఆమోదిస్తుంది. దరఖాస్తుల గడువు ముగిసిన లేదా రిజిస్ట్రేషన్ పూర్తయిన 30 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తారు.

నేరుగా బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ

మొదటి కేటగిరీ అభ్యర్థులు విదేశీ ఉద్యోగ సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూలో ఎంపిక కావాలి. ఉద్యోగ నియామక పత్రం, వీసా పొందిన తర్వాత వీసా ఖర్చులో 50 శాతం చెల్లిస్తారు. విమాన ప్రయాణం పూర్తి చేసి సంబంధిత దేశానికి చేరుకున్న తర్వాత ప్రయాణ పత్రాలను సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హమైన ప్రయాణ ఖర్చులో 50 శాతం చెల్లిస్తారు.

రెండో కేటగిరీ అభ్యర్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. టామ్‌కామ్ ఆధ్వర్యంలో లేదా టామ్‌కామ్ గుర్తించిన సంస్థల్లో విదేశీ భాషా శిక్షణ పొందిన వారికి శిక్షణ ఖర్చులో 50 శాతం సబ్సిడీ అందిస్తారు. శిక్షణ పూర్తి చేసి భాషా పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. వీరికి ప్రయాణ ఖర్చుల సబ్సిడీ వర్తించదు.

ఇప్పటికే విదేశీ భాషా పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వీసా, విమాన ప్రయాణ ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీ అందిస్తారు. వీరికి భాషా శిక్షణ సబ్సిడీ వర్తించదు. రెండో కేటగిరీలో ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. సంబంధిత పత్రాలు, రసీదులను పరిశీలించి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తారు.

కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు

పథకం అమలుకు రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీతో పాటు 33 జిల్లాల్లో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రస్థాయి కమిటీకి టామ్‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ అధ్యక్షుడిగా, జనరల్ మేనేజర్ కన్వీనర్‌గా ఉంటారు. కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి, ఉపాధి కల్పన, శిక్షణ, కార్మిక, ఆర్థిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సెర్ప్, మెప్మా, గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కమిటీలో ఉంటారు.

జిల్లాస్థాయి కమిటీలకు కలెక్టర్లు అధ్యక్షులుగా ఉంటారు. ఆర్డీవో లేదా తహసీల్దార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. ఆయా సంక్షేమ శాఖల అధికారులతో పాటు సెర్ప్, మెప్మా ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అభ్యర్థుల ఎంపిక, ఉద్యోగ సంస్థల విశ్వసనీయత, వీసాల జారీ ప్రక్రియ, సబ్సిడీ చెల్లింపులను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాల్లో చేరిన వారి వివరాలు, పురోగతిపై ప్రతి మూడు నెలలకు జిల్లా ఉపాధి కల్పన అధికారులు టామ్‌కామ్‌కు నివేదిక సమర్పిస్తారు.

ఒక్కసారే సబ్సిడీ

పథకంలో నమోదు చేసుకోవడానికి ముందు అభ్యర్థులు చేసిన ఖర్చులకు సబ్సిడీ వర్తించదు. భాషా పరీక్షలు, వీసా వంటి ఒక్కో అంశానికి ఒక్కసారి మాత్రమే సబ్సిడీ అందిస్తారు. తొలి ప్రయత్నంలో అర్హత సాధించకపోతే తదుపరి ప్రయత్నాలకు అయ్యే ఖర్చును అభ్యర్థులే భరించాలి. మధ్యలో వైదొలిగితే తదుపరి విడతల సబ్సిడీ నిలిపివేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నకిలీ పత్రాలు సమర్పించినా, నిధులను దుర్వినియోగం చేసినా లబ్ధిదారుల ఎంపికను రద్దు చేస్తారు. చెల్లించిన సబ్సిడీని తిరిగి వసూలు చేస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us