Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ మార్గంలో కూడా వన్‌వే విధానం.. అమలుకు రెడీ..
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు సరికొత్త ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వన్ వే విధానం అమలు చేస్తుండగా.. ఇప్పుడు లక్డీకాపూల్‌లో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలు ప్రాంతాల్లో వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వనే వే సిస్టం అమలు చేయగా.. ఇప్పుడు ట్రాఫిక్ సజావుగా సాగేలా చేసేందుకు మరికొన్ని ప్రాంతాల్లో కూడా దీనిని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా లక్డీకాపుల్ మార్గంలో కూడా వన్ వే విధానాన్ని అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. లక్డీకాపూల్ మార్గం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నిర్ణయించారు.
తాజాగా లక్డీకాపూల్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యటించారు. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్ క్రాస్ రోడ్స్, పాత కంట్రోల్ రూమ్ జంక్షన్, ద్వారకా హోటల్ ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా వెళ్లేందుకు వీలుగా పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా వన్ వే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పాత కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి నుంచి నేరుగా అనుమతించరు. వీటిని పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, సెక్రటేరియట్ జంక్షన్ మీదుగా పంపించనున్నారు.
సచివాలయం జంక్షన్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుండి పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్ నుండి రవీంద్ర భారతి వైపు వెళ్లి, పాత కంట్రోల్ రూమ్ వద్ద యూ-టర్న్ తీసుకుని, అసెంబ్లీ గేట్ నెం. 3, రవీంద్ర భారతి, హెచ్‌డీఎఫ్‌సీ మీదుగా పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటాయి. నిరంకారి జంక్షన్ నుండి పాత కంట్రోల్ రూమ్‌కు వెళ్లే వాహనాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లించి ఇక్బాల్ మినార్ వద్ద కుడివైపుకు తిరిగి రవీంద్ర భారతి మీదుగా పాత కంట్రోల్ రూమ్‌కు చేరేలా రూట్ మ్యాప్ సిద్దం చేయనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఈ మార్పులను అమలు చేయనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో దీనిని అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్దమవుతున్నారు. అటు కేబీఆర్ పార్క్ వద్ద ఇప్పటికే వన్‌వే వ్యవస్థ అమల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వన్‌వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్ లేన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
