వర్షంలో వేడి వేడిగా కట్ లెట్ తింటే ఆ మజానే వేరు..! క్రంచీ పాలకూర కట్ లెట్ రెసిపీ మీకోసం
వర్షాకాలంలో వేడి వేడి టీతో కలిసి తినడానికి మంచి హెల్దీ రెసిపీ ఏదైనా తినాలనుకుంటున్నారా..? అయితే ఈ పాలకూర కట్ లెట్ ను పక్కాగా ట్రై చేయండి. ఇది తక్కువ నూనెతో తయారవుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సులభంగా చేసుకునే ఈ క్రంచీ కట్ లెట్ రెసిపీ వర్షం పడుతున్నప్పుడు తినడానికి బెస్ట్ ఛాయిస్.

బయట చిటపట వర్షం పడుతుంటే.. వేడి వేడిగా, కొత్తగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తుందా..? అయితే ఈసారి మీరు ఈ రెసిపీని పక్కాగా ట్రై చేయాల్సిందే.. మీకోసం ఓ ప్రత్యేకమైన, అదిరిపోయే క్రంచీ పాలకూర కట్ లెట్ రెసిపీని తీసుకొచ్చాను. ఇది ఆరోగ్యానికి మంచిది, పైగా తయారు చేయడం కూడా ఎంతో తేలిక. ఈ వర్షాకాలంలో వేడి వేడి టీతో కలిపి తింటే ఆహా.. ఏమి రుచి అనాల్సిందే..! తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
కావాల్సిన పదార్థాలు
- పాలకూర – 1 కప్పు (సన్నగా తరిగి ఉడికించినవి)
- ఉల్లిపాయ – ¼ కప్పు (చిన్న ముక్కలుగా తరిగినవి)
- వెల్లుల్లి – 1 టీస్పూన్ (బాగా తరిగినవి)
- పచ్చిమిర్చి – 2 టీస్పూన్లు (సన్నగా తరిగినవి)
- పుదీనా ఆకులు – 1 టేబుల్ స్పూన్ (తరిగినవి)
- బంగాళాదుంపలు – ½ కప్పు (మెత్తగా ఉడికించినవి)
- నూనె – 2 టీ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
- పసుపు పొడి – ¼ టీస్పూన్
- గరం మసాలా – ½ టీస్పూన్
- మిరియాల పొడి – 1 టీస్పూన్
కోటింగ్, ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు
- ఆయిల్ – వేయించడానికి సరిపడా
- మైదా – 2 టీస్పూన్లు (¼ కప్పు నీటిలో కలపాలి)
- రస్క్ పొడి లేదా బ్రెడ్ క్రంబ్స్ – అవసరమైనంత
తయారీ విధానం
ముందుగా ఒక పాన్ లో 2 టీస్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేయాలి. అవి మెత్తగా అయ్యే వరకు వేయించాక, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ దశలో పాలకూరను వేసి పాన్ మూతపెట్టి చిన్న మంటపై మృదువుగా అయ్యే వరకు ఉడికించాలి. పాలకూర సరిగా ఉడికిన తర్వాత బంగాళాదుంప మిశ్రమం వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు వండి.. స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారనివ్వాలి.
చల్లారిన మిశ్రమాన్ని సమాన సైజుల్లో తీసుకుని గుండ్రంగా లేదా కట్ లెట్ ఆకారంలో తయారు చేయాలి. తయారు చేసిన ఒక్కో కట్ లెట్ ను మైదా నీటిలో ముంచి ఆ తర్వాత రస్క్ పొడితో కోటింగ్ చేయాలి. చివరిగా వేడి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
ఈ వేడి వేడి కట్ లెట్ ను టొమాటో సాస్ లేదా టీతో సర్వ్ చేయండి. ఇవి నూనె తక్కువగా ఉండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పైగా వీటిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.




