Aloo Tikki: ఇంట్లోనే కరకరలాడే ఆలూ టిక్కీ.. ఈజీగా తయారు చేయండిలా
సాయంత్రం చిరు ఆకలికి బయటి స్నాక్స్ బదులు ఇంట్లో కరకరలాడే ఆలూ టిక్కీ ది బెస్ట్ ఆప్షన్. మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం వర్షాకాలంలో వేడివేడిగా మరింత రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట కలిగే ఫుడ్ క్రేవింగ్స్ కు ఆలూ టిక్కీని తయారుచేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికితోడు ఈ వర్షకాలంలో చల్లటి వాతావరణంలో వేడి వేడిగా భలే అనిపిస్తుంది. దీనిని తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశం వైవిధ్యభరితమైన వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆలూ టిక్కీ అందులోని ఓ ప్రముఖ స్ట్రీట్ ఫుడ్. వివాహ వేడుకల నుండి చిన్న చిన్న కార్యక్రమాల వరకు ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టేయవచ్చు. అయితే, మార్కెట్లో లభించే టిక్కీ రుచికరంగా ఉన్నప్పటికీ, కల్తీ భయం వల్ల చాలామంది బయట తినడానికి వెనకాడుతారు. అందుకే ఇంట్లోనే ఐదు నిమిషాల్లో ఇలా చేసేయండి..
కావలసిన పదార్థాలు:
మీడియం సైజు బంగాళాదుంపలు – 4
పచ్చిమిర్చి – 2-3 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
అల్లం పేస్ట్ – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
పసుపు పొడి – 1/4 టీస్పూన్
గరం మసాలా పొడి – 1/4 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వేయించడానికి
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత తొక్క తీసి, తురుముకోవాలి.
తురుముకున్న బంగాళాదుంపలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, చేతితో బాగా మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేయాలి.
అన్ని పదార్థాలను బంగాళాదుంపలతో కలిపి బాగా కలపాలి, తద్వారా మసాలాలు బంగాళాదుంపలకు చక్కగా పట్టుకుంటాయి.
ఈ మిశ్రమం నుండి మీకు నచ్చిన ఆకారంలో (గుండ్రంగా లేదా అండాకారంలో) టిక్కీలను తయారుచేసుకోవాలి.
ఒక పెనంపై కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. మధ్యస్థ మంటపై టిక్కీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు, కరకరలాడే వరకు కాల్చుకోవాలి.
కాల్చిన తర్వాత, టిక్కీలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని, అదనపు నూనెను తొలగించడానికి టిష్యూ పేపర్‌ను ఉపయోగించండి.
వేడివేడి ఆలూ టిక్కీని టొమాటో కెచప్ లేదా కొత్తిమీర చట్నీతో కలిపి సర్వ్ చేసి ఆనందించండి.




