AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ లివర్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

మీరు తరచూ అలసటగా అనిపిస్తోందా? జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్టు ఉందా? అయితే మీ డైట్‌లో లివర్ చేర్చుకోవాల్సిందేనంని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఐరన్, విటమిన్ 12, జింక్ వంటి అద్భుత పోషకాలు ఉన్న చికెన్, మటన్ లివర్లు శరీరానికి కొండంత బలాన్ని ఇస్తాయి. కానీ అందరికీ ఇవి మేలు చేయవు. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చికెన్ లివర్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..
Chicken Liver Vs Mutton Liver
Krishna S
|

Updated on: Jul 10, 2026 | 1:42 PM

Share

మాంసాహారుల ప్రియమైన వంటకాల్లో చికెన్ లివర్, మటన్ లివర్ ఎప్పుడూ స్పెషలే. ఇవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలకు పవర్‌హౌస్‌లు. అయితే ఆరోగ్య పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనే డౌట్ చాలా మందికి వస్తుంది. తక్కువ ధరకు దొరికే చికెన్ లివర్‌లో ఐరన్, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి12, ఫ్లేట్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే సెలీనియం అనే మూలకం క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ, బి12లు కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపునకు ఇది ఎంతో మేలు చేస్తుంది. చికెన్ లివర్‌లో హీమ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని శరీరం చాలా వేగంగా గ్రహిస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుత ఔషధం. మధుమేహం ఉన్నవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, అలాగే ఉడికించిన చికెన్ లివర్ తినడం ద్వారా శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి ఇది తోడ్పడుతుంది.

మటన్ లివర్ – పోషకాల గని

మటన్ లివర్ చికెన్ లివర్ కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ పోషకాల విషయంలో చాలా ముందంజలో ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, డి, బి12లతో పాటు జింక్, కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మటన్ లివర్‌లో విటమిన్ బి12 చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ బి12 శీరరంలో రోగనిరోధక శక్తిని పటిష్టం చేసి, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే జింక్, సెలీనియం, కాపర్ వంటి ఖనిజాలు ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి ఎంతో అవసరం.

ఏది ఎక్కువ ఆరోగ్యకరం? మీ శరీర అవసరాన్ని బట్టి ఎంచుకోండి..

చికెన్, మటన్ లివర్లు రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, మీ శరీరానికి ఏ పోషకాలు అవసరమో దాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి.

  • మీకు రక్తహీనత, విపరీతమైన అలసట ఉంటే.. ఐరన్, ఫ్లేట్, సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్లు ఉన్న చికెన్ లివర్ ఉత్తమం.
  • ఒకవేళ మీకు మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, నరాల బలం, జింక్ వంటి ఖనిజాలు కావాలనుకుంటే.. మటన్ లివర్ బెస్ట్ ఛాయిస్.

వీరు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..

లివర్ వంటకాలను వారానికి ఒకసారి సరిపడా మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అతిగా తింటే నష్టాలు తప్పవు. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి..

యూరిక్ యాసిడ్ – గౌట్ సమస్య: లివర్‌లో ప్యూరిన్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచి, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

గుండె జబ్బులు – కొలెస్ట్రాల్: చికెన్, మటన్ లివర్‌లలో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవారు, హై కొలెస్ట్రాల్ బాధితులు దీనిని తినేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీలు: లివర్‌లో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ ప్రారంభంలో విటమిన్ ఎ అతిగా శరీరంలోకి చేరితే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి గర్భిణీలు డాక్టర్ సలహా మేరకే దీనిని తినాలి.

కిడ్నీ రోగులు: మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కూడా లివర్ వంటకాలను వీలైనంత వరకు దూరం పెట్టడమే మంచిది.

Follow Us