ఫుడ్ సేఫ్టీ తనిఖీల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మొదలైన ‘లైవ్ కిచెన్’ విప్లవం..!
హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న మెరుపు తనిఖీలు హోటల్ పరిశ్రమలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. స్టార్ హోటళ్ల నుంచి గల్లీల్లోని క్లౌడ్ కిచెన్ల వరకు అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన ముడిపదార్థాలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి ఉల్లంఘనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం బయట తినడానికే భయపడుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న మెరుపు తనిఖీలు హోటల్ పరిశ్రమలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాయి. స్టార్ హోటళ్ల నుంచి గల్లీల్లోని క్లౌడ్ కిచెన్ల వరకు అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన ముడిపదార్థాలు, సిబ్బంది నిర్లక్ష్యం వంటి ఉల్లంఘనలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం బయట తినడానికే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, కోల్పోయిన కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు నగరంలోని పలు రెస్టారెంట్లు సరికొత్తగా ‘లైవ్ కిచెన్ డిస్‌ప్లే స్క్రీన్’ విధానాన్ని తెరపైకి తెచ్చాయి.
ఇకపై కిచెన్‌లోకి వెళ్లకుండానే లోపల ఏం జరుగుతుందో కస్టమర్లు నేరుగా తెలుసుకోవచ్చు. రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే కనిపించేలా పెద్ద డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి, వాటిని కిచెన్‌లోని సీసీ కెమెరాలకు అనుసంధానిస్తున్నారు. తాము ఆర్డర్ చేసిన ఆహారాన్ని ఎలా వండుతున్నారు? సిబ్బంది గ్లోవ్స్, హెయిర్ క్యాప్స్ ధరించారా? కిచెన్ ఎంత పరిశుభ్రంగా ఉందనేది కస్టమర్లకు లైవ్‌లో చూపిస్తున్నారు. కేవలం వంట గది మాత్రమే కాకుండా.. నాన్‌వెజ్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, డీప్ ఫ్రీజర్లు, వాషింగ్ ఏరియాలను కూడా ఈ నిఘా పరిధిలోకి తెచ్చి స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు.
ఈ పారదర్శక విధానానికి నగరవాసుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. గతంలో కేవలం రుచికే ప్రాధాన్యమిచ్చిన జనం, ఇప్పుడు పరిశుభ్రతను కూడా కళ్లారా చూసి కుటుంబంతో కలిసి ధైర్యంగా భోజనానికి వస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నం వల్ల గూగుల్ రేటింగ్స్ పెరిగి, వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయని హోటల్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, కస్టమర్లు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనే బాధ్యతతో హోటల్ సిబ్బంది కూడా పారిశుధ్య నియమాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీల భయంతో మొదలైన ఈ మార్పు, ప్రస్తుతం హోటళ్ల మధ్య ఆరోగ్యకరమైన నాణ్యతా పోటీకి దారితీసింది. నగరంలోని అన్ని రెస్టారెంట్లు ఈ ‘లైవ్ స్క్రీన్’ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే భవిష్యత్తులో వినియోగదారుల ఆరోగ్యానికి మరింత భద్రత లభిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
