ముఖం ఎక్కువసార్లు కడుగుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే స్కిన్ పాడవుతుందని తెలీదా
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అందంగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే రకరకాల ఫేస్ వాష్‌లు, క్లెన్సర్లు ఉపయోగిస్తూ పదేపదే ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంటారు. అయితే, చర్మ సంరక్షణ కోసం చేసే ఈ ప్రయత్నాల్లోనే తెలియకుండా కొన్ని తీవ్రమైన పొరపాట్లు జరుగుతుంటాయి.

చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, చేతులు కడుక్కోకుండానే నేరుగా ముఖాన్ని ముట్టుకోవడం. రోజంతా మనం ఎన్నో వస్తువులను తాకుతుంటాం, దీనివల్ల మన చేతులకు కంటికి కనిపించని బ్యాక్టీరియా, మురికి పేరుకుపోతాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం కడుక్కుంటే, ఆ బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి ఫేస్ వాష్ చేసే ముందు తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో మొదటి మెట్టుగా పనిచేస్తుంది.
పొడి చర్మంపై సబ్బు ప్రభావం..
ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సాధారణ సబ్బులను అస్సలు వాడకూడదు. సబ్బులలో ఉండే రసాయనాలు చర్మంలోని సహజ సిద్ధమైన తేమను పూర్తిగా హరిస్తాయి. దీనివల్ల చర్మం మరింత పొడిబారి, నిర్జీవంగా మారుతుంది. వీరు సబ్బులకు బదులుగా తేనె లేదా బాగా పండిన అరటిపండుతో ముఖాన్ని మెల్లగా మర్దన చేసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది. స్నానం చేసిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న వెంటనే మంచి మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. నిపుణుల సలహా మేరకు మాత్రమే మీ చర్మ రకానికి సరిపోయే ఫేస్ వాష్ ఎంచుకోవడం మంచిది.
క్లెన్సర్లు లేదా స్క్రబ్‌లను అతిగా వాడటం కూడా చర్మానికి హాని కలిగిస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడానికి స్క్రబ్ అవసరమే అయినా, దానిని తరచూ వాడటం వల్ల చర్మం తన కాంతిని కోల్పోతుంది. అలాగే ముఖాన్ని కడుక్కోవడానికి అతి చల్లటి నీళ్లను లేదా బాగా వేడి నీళ్లను వాడకూడదు. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని మురికి సులభంగా తొలగిపోతుంది.
అతి వేడి నీళ్లు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ చిన్నపాటి అజాగ్రత్తల వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడమే కాకుండా, మొటిమలు, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖం కడుక్కునే సమయంలో మనం చేసే ఆ పొరపాట్లు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
