Guava: జామకాయను ఉప్పుతో కలిపి తినొచ్చా.? వీరు తింటే మాత్రం డేంజర్..
జామకాయను ఉప్పుతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

జామకాయను ఉప్పుతో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు వైద్యులు సమాధానం ఇచ్చారు. సరైన పద్ధతిలో తీసుకుంటే జామకాయను ఉప్పుతో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామకాయ కేవలం రుచిని మాత్రమే కాదు.. అపారమైన పోషక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఈ పండు అనేక విధాలుగా మన శరీరానికి మేలు చేస్తుంది. జామ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆపిల్ కంటే పది రెట్లు ఎక్కువ ప్రోటీన్, మూడు నారింజల కంటే ఎక్కువ విటమిన్ సి జామకాయలో లభిస్తుంది. ముఖ్యంగా జామకాయను నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పుతో కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.
జీర్ణక్రియ మెరుగుదల:
జామకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నల్ల ఉప్పుతో కలిపి తింటే ఇది మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
జామపండ్లలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఉప్పు ద్రవ సమతుల్యతకు సహాయపడటంతో, ఇది రోగనిరోధక వ్యవస్థకు ఒక గొప్ప కలయికగా మారుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ:
జామకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహగ్రస్తులకు లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం:
జామపండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించడంలో తోడ్పడుతుంది. ఉప్పు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కంట్రోల్‌గా ఉంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే.
ఊబకాయం:
జామకాయలో అధిక ఫైబర్, తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఉప్పుతో కలిపి తీసుకుంటే పోషకాల శోషణ మెరుగుపడుతుంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ఉప్పు వినియోగాన్ని తగ్గించుకోవాలి లేదా వైద్యుని సలహా తీసుకోవాలి.
