ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ పని ఖతమే.. ఈ విషయాలు తెలిస్తే షాకే..
మీరు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బ్రెడ్‌ను లాగించేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. మనం ఆరోగ్యకరం అనుకునే ఈ బ్రెడ్.. ఖాళీ కడుపుతో తింటే మన శరీరంలో ఒక సైలెంట్ కిల్లర్‌లా మారుతుందని అటు ఆయుర్వేదం, ఇటు సైన్స్ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అసలు ఉదయం పూట బ్రెడ్ ఎందుకు తినకూడదు? అనేది తెలుసుకుందాం..

చాలా మంది ఉదయంపూట సమయం లేకనో లేదా తేలికగా ఉంటుందనో టీతోనో లేదా విడిగానో బ్రెడ్‌ను తినేస్తుంటారు. బ్రెడ్ తేలికైన ఆహారం అని మనం భావిస్తాం కానీ ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం హెచ్చరిస్తున్నాయి. బ్రెడ్‌లో ప్రధానంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణమైన వెంటనే త్వరగా గ్లూకోజ్‌గా మారిపోతాయి. ఉదయం ఖాళీ కడుపుతో బ్రెడ్ తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల వెంటనే అలసట, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదంలో ఉదయం పూట చక్కెర లేదా పిండి పదార్ధాలు కలిగిన ఆహారాన్ని నేరుగా తీసుకోవడం వల్ల శరీరంలో పిత్త, కఫ దోషాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది మగతకు, శరీరంలో అసౌకర్యానికి కారణమవుతుంది. మన జీర్ణక్రియ ఒక అగ్ని లాంటిదని, బ్రెడ్ వంటి ఆహారం ఆ అగ్నిని బలహీనపరిచి అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పోషకాహార లోపం – కొలెస్ట్రాల్ ముప్పు
తెల్ల రొట్టె తయారీలో ఫైబర్, విటమిన్ ఇ, ముఖ్యమైన ఖనిజాలు దాదాపుగా నశిస్తాయి.
గుండె జబ్బులు: పీచు పదార్థం లేని బ్రెడ్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
బరువు పెరగడం: బ్రెడ్ తిన్న కాసేపటికే మళ్ళీ ఆకలి వేస్తుంది. దీనివల్ల మనం అతిగా ఆహారం తీసుకుంటాం. ఈ అదనపు కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వుగా పేరుకుపోయి బరువు పెరగడానికి కారణమవుతాయి.
మలబద్ధకం: ఫైబర్ లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగించి మలబద్ధకం సమస్య వేధిస్తుంది.
ప్రత్యామ్నాయం ఏంటి?
ఉదయం అల్పాహారంలో కేవలం బ్రెడ్ మాత్రమే కాకుండా.. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. అంటే గుడ్లు, మొలకెత్తిన గింజలు లేదా తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
