ఒక కప్పు టీ కోసం మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టొద్దు.. అది రాంగ్ టైమింగ్
భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలోని టానిన్‌లు, పాలీఫెనాల్‌లు ఆహారంలోని ఇనుము, కాల్షియం, జింక్ వంటి ఖనిజాల శోషణను తగ్గించవచ్చు. దీంతో దీర్ఘకాలంలో రక్తహీనత వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు కూడా పెరగవచ్చు. ఆరోగ్య ప్రయోజనాల కోసం భోజనం చేసిన కనీసం గంట తర్వాత టీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు..

మనదేశంలో చాలామంది తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. టీ అనేది కేవలం పానీయం మాత్రమే కాదు, చాలామందికి అది రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో ఇనుము, కాల్షియం, జింక్ వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. అయితే టీలో ఉండే టానిన్‌లు, పాలీఫెనాల్‌లు ఈ ఖనిజాల శోషణను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా టానిన్‌లు ఇనుముతో కలిసిపోవడం వల్ల శరీరం దానిని సరిగా గ్రహించలేకపోతుంది. దీర్ఘకాలంలో ఇది ఇనుము లోపం, రక్తహీనత వంటి సమస్యలకు దారితీయవచ్చు. అలాగే కాల్షియం, జింక్ శోషణ కూడా తగ్గే ప్రమాదం ఉంది.
భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా ప్రభావితమవుతుంది. కొందరిలో కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు కనిపించవచ్చు. టీలోని కెఫీన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత టీ తాగడం వల్ల నిద్ర నాణ్యత కూడా దెబ్బతినవచ్చు. అయితే టీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం గంట సమయం గడిచిన తర్వాత టీ తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి సక్రమంగా అందుతాయి. అలాగే టీతో పాటు అధిక నూనె లేదా మసాలాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం తగ్గించడం మంచిదని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం భోజనానికి, టీకి మధ్య కొంత విరామం ఇవ్వడం ఒక చిన్న మార్పు అయినప్పటికీ, దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందించగలదని నిపుణులు సూచిస్తున్నారు.
