Nara Lokesh :షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు.. ఇక దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది- మంత్రి లోకేష్
వచ్చే ఏడాదిలో రెండు లక్షల మంది ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి.. భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ఏడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు మంత్రి లోకేష్. 55మంది టెన్త్ షైనింగ్ స్టార్లకు రూ. 30వేలు ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికేట్, 61మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్ ట్యాప్, మెడల్ అందజేశారు.

కష్టపడి చదివి అద్భుత ప్రతిభ కనబరిచిన ‘షైనింగ్ స్టార్స్’ ప్రభుత్వ పాఠశాలల చరిత్రను తిరగరాశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ఇటీవల సాధించిన ఉత్తమ ఫలితాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థుల కష్టమే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చిందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరడం ఈ మార్పునకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు
విద్యాశాఖను వ్యవసాయంతో పోల్చిన మంత్రి.. దీని ఫలితాలు వెంటనే రావని, నిరంతర కృషి అవసరమని చెప్పారు. విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ కింద లీప్ యాప్‌ను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విజయాలను సెలబ్రేట్ చేస్తూ, పత్రికల్లో వారి ఫోటోలతో ప్రకటనలు ఇచ్చి గౌరవించుకున్నామన్నారు. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా టెక్స్ట్‌బుక్స్, బ్యాగులు, గుడ్లపై ఎవరి ఫోటోలు లేకుండా చేశామని.. ప్రభుత్వ స్కూళ్లలో త్వరలోనే ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని.. 10 వేల పాఠశాలల్లో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. డొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఫైన్ రైస్, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత గత ఏడాది 72.8శాతం నుండి ఈసారి 78.39శాతానికి పెరిగిందని మంత్రి వెల్లడించారు.
విలువలతో కూడిన విద్యే ముఖ్యం
సమాజంలో నైతిక విలువలు, మహిళలను గౌరవించడం చాలా ముఖ్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఇందుకోసమే చాగంటి కోటేశ్వరరావును విలువ ఆధారిత విద్యకు సలహాదారుగా నియమించినట్లు చెప్పారు. అమ్మకు చెప్పలేని ఏ పనీ చేయకూడదు అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
ఓటమే గెలుపునకు పునాది: విద్యార్థులకు పిలుపు
విద్యార్థులు ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఫెయిల్ అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం అని మంత్రి హితబోధ చేశారు. 2019లో తాను మంగళగిరిలో ఓడిపోయినప్పుడు బాధపడ్డానని.. కానీ ఐదేళ్లు కష్టపడి ఈరోజు 91 వేల మెజారిటీతో గెలిచానన్నారు. తన జీవితమే మీకు ఒక ఉదాహరణ అని స్ఫూర్తి నింపారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తోందని, విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో తాము చదివిన స్కూళ్లకు సహాయం చేయాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
