నిమ్మ తొక్కతో ఇలా చేస్తే మోచేతులు, మోకాళ్ల నలుపు చిటికెలో మాయం.. ఎవ్వరు చెప్పని సీక్రెట్స్..
చాలా మంది ముఖ సౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత మోచేతులు, మోకాళ్లు, పాదాల సంరక్షణకు ఇవ్వరు. ఫలితంగా ఆయా భాగాల్లో మురికి పేరుకుపోయి, చర్మం నల్లగా మారిపోతుంది. దీనికోసం బ్యూటీ పార్లర్లలో వేల రూపాయల ఖర్చు పెడుతుంటారు. అయితే రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో వాడేసిన నిమ్మకాయ తొక్కలతోనే ఈ మొండి నలుపుకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది ఇళ్లలో నిమ్మరసం పిండుకున్న తర్వాత ఆ తొక్కలను చెత్తబుట్టలో పారేస్తుంటారు. కానీ ఆ నిమ్మ తొక్కల్లో కూడా అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి దాగున్నాయనే విషయం మీకు తెలుసా..? ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే మోచేతులు, మోకాళ్లు, పాదాల దగ్గరి నలుపుదనాన్ని సహజంగా వదిలించుకోవడానికి ఈ నిమ్మ తొక్కలు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని రాంచీకి చెందిన బ్యూటీ ఎక్స్‌పర్ట్ సునిధి వివరిస్తున్నారు. ఈ నలుపుదనాన్ని పోగొట్టుకోవడానికి బ్యూటీ పార్లర్లలో పెడిక్యూర్, మేనిక్యూర్ల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు, ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి హోమ్ రెమెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
వింత మిశ్రమం – అద్భుత ఫలితం
మోచేతులు, మోకాళ్లపై ఉండే మొండి నలుపుదనాన్ని, పేరుకుపోయిన మురికిని వదిలించుకోవడానికి నిమ్మ తొక్కలతో ఒక పవర్‌ఫుల్ స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి కేవలం మూడు వస్తువులు.. వాడేసిన నిమ్మకాయ తొక్క, కొద్దిగా చక్కెర, చిటికెడు బేకింగ్ సోడా..
ఎలా ఉపయోగించాలి?
స్టెప్ 1: రసం పిండేసిన నిమ్మకాయ తొక్కను తీసుకోండి. దాని లోపలి భాగంలో కొద్దిగా ఇంట్లో వాడే సాధారణ చక్కెర గింజలను, చిటికెడు బేకింగ్ సోడాను వేయండి.
స్టెప్ 2: ఇప్పుడు ఆ తొక్కను మీ మోచేతులు, మోకాళ్లు లేదా నల్లగా ఉన్న చర్మం భాగాలపై ఉంచి బాగా రుద్దండి.
స్టెప్ 3: ఇలా కంటిన్యూస్‌గా 1 నుండి 2 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేస్తూ రుద్దాలి.
స్టెప్ 4: రుద్దడం పూర్తయిన తర్వాత ఆ మిశ్రమాన్ని చర్మంపై కనీసం అర గంట నుండి ఒక గంట పాటు అలాగే వదిలేయండి. ఆరనిచ్చిన తర్వాత సాధారణ నీటితో శుభ్రంగా కడుక్కోండి.
ఇది ఎలా పనిచేస్తుంది?
బ్యూటీ ఎక్స్‌పర్ట్ సునిధి తెలిపిన వివరాల ప్రకారం, నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో పాటు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను చాలా సులభంగా తొలగిస్తాయి. మరోవైపు, బేకింగ్ సోడా చర్మం లోపల పేరుకుపోయిన మురికిని లాగేయడంలో సాయపడగా, చక్కెర గింజలు ఒక మంచి సహజ సిద్ధమైన స్క్రబర్‌లా పనిచేస్తాయి. ఈ మూడు కలిసినప్పుడు ఎంతటి మొండి నలుపు అయినా వదిలిపోతుంది.
ఫలితం ఎప్పుడు కనిపిస్తుంది?
ఈ చిట్కాను రోజుకు రెండు సార్లు క్రమం తప్పకుండా పాటిస్తే, కేవలం ఒక వారంలోనే మార్పు గమనించవచ్చు. కేవలం నెల రోజుల్లో చర్మం పూర్తిగా క్లియర్ గా, కాంతివంతంగా మారుతుంది. వేల రూపాయల కెమికల్ క్రీములు ఇవ్వని రిజల్ట్‌ను ఈ చిన్న వంటింటి చిట్కా అందిస్తుంది.
సలహా: సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు బేకింగ్ సోడాను ముఖంపై నేరుగా వాడకూడదు. మోచేతులు, మోకాళ్ల చర్మం కాస్త మందంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
