చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..? ఈ తప్పులు మాత్రం చేయొద్దు..
Chicken vs fish: చాలా మందికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అందులోనూ చికెన్, చేపలు అంటే ఇష్టపడని వారు ఎవరుండరు. అయితే వర్షాకాలంలో మనం తినే ఆహారంలో చిన్న మార్పు వచ్చినా అది నేరుగా హాస్పిటల్ బెడ్ దాకా తీసుకెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాల సమయంలో చికెన్ తినడం మంచిదా? లేక చేపలు తినడం మంచిదా? అనేది తెలుసుకుందాం..

వర్షాకాలం రానే వచ్చింది. వేడి వేడి వాతావరణం చల్లబడటంతో పాటు ఈ సీజన్ ఎన్నో ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరాలను కూడా వెంటబెట్టుకొస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లలు, పెద్దల రోగనిరోధక శక్తి కాస్త తగ్గుతుంది. తీసుకునే ఆహారంలో చిన్న మార్పు వచ్చినా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే నాన్‌వెజ్ ప్రియులకు ఒక పెద్ద సందేహం వస్తుంటుంది.. వర్షాకాలంలో చికెన్ తినడం మంచిదా? లేక చేపలు తినడం మంచిదా? దీనికి సంబంధించి నిపుణులు చెప్పేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో జీర్ణక్రియ ఎలా ఉంటుంది?
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీర మెటబాలిజం సాధారణం కంటే కొంచెం నెమ్మదిగా మారుతుంది. ఈ సమయంలో హెవీగా ఉండే పోషకాలు, కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
చేపలు మంచివే.. కానీ ఈ సీజన్‌లో నో చెప్తేనే మేలు..
చేపలలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వర్షాకాలంలో చేపలను తినే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలం అనేది చేపలకు గుడ్లు పెట్టే సమయం. ఈ సమయంలో వాటి శరీరంలో సహజమైన హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఇవి మానవ శరీరానికి అంత మంచివి కావు.
నీటి కాలుష్యం: వర్షాల వల్ల నదులు, చెరువులు, సముద్రపు నీరు కలుషితమవుతుంది. దీనివల్ల నీటిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు చేపల శరీరంలోకి చేరతాయి. ఇవి తింటే ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణక్రియ భారంగా మారుతుంది: చేపలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. మందగించిన జీర్ణక్రియ ఉన్నప్పుడు ఇవి తింటే అజీర్తి చేస్తుంది.
చికెన్ మంచిదేనా?
వర్షాకాలంలో చేపల కంటే తాజా కోడి మాంసం తినడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్‌లో క్వాలిటీ ప్రొటీన్, విటమిన్ బి6, జింక్ ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వర్షాకాలపు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.
చికెన్ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
తాజా మాంసమే వాడాలి: ఫామ్‌లు శుభ్రంగా ఉన్న చోటు నుండే చికెన్ కొనాలి. నిల్వ ఉంచిన చికెన్ అస్సలు వాడొద్దు.
వేడి నీటితో కడగాలి: వండే, ముందు చికెన్‌ను కనీసం రెండు మూడు సార్లు గోరువెచ్చని నీటితో కడగడం వల్ల దానిపై ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.
బాగా ఉడికించాలి: చికెన్‌ను హాఫ్ బాయిల్డ్ లేదా తక్కువ ఉడికించి తినకూడదు. పూర్తిగా ఉడికించిన చికెన్ మాత్రమే సులభంగా జీర్ణమవుతుంది.
చేపల ప్రియులు ఏం చేయాలి?
ఒకవేళ మీకు చేపలు తినడం చాలా ఇష్టమైతే.. ఖచ్చితంగా తాజా చేపలను మాత్రమే మార్కెట్ నుండి ఎంచుకోండి. నిల్వ ఉంచిన, ఐస్ వేసిన చేపలను అస్సలు కొనకండి. వాటిని కూడా ఇంటికి తెచ్చాక బాగా శుభ్రం చేసి, ముక్కలు బాగా ఉడికేలా వండుకుని తినడం సురక్షితం.
వర్షాకాలంలో వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే వేడి వేడి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. నాన్‌వెజ్ తినాలనుకుంటే చికెన్ సూప్ లేదా తక్కువ మసాలాలతో వండిన చికెన్ కర్రీ బెస్ట్ ఆప్షన్.
