Milk: ఆవు పాలు మంచివా, గేదె పాలు మంచివా.. వైద్యులు ఏం చెబుతున్నారు?
పిల్లల ఆహారంలో పాలు అతి ముఖ్యమైన భాగం. కానీ ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా? అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానం లేదు. ఇంట్లో పెద్దలు, పొరుగింటివాళ్లు, సోషల్ మీడియా ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా చెబుతుంటారు. ఒకరు ‘గేదె ..

పిల్లల ఆహారంలో పాలు అతి ముఖ్యమైన భాగం. కానీ ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా? అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానం లేదు. ఇంట్లో పెద్దలు, పొరుగింటివాళ్లు, సోషల్ మీడియా ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా చెబుతుంటారు. ఒకరు ‘గేదె పాలు బలం ఇస్తాయి’ అంటారు.
మరొకరు ‘ఆవు పాలే మంచివి’ అంటారు. సోషల్ మీడియాలో రెండు వర్గాలూ గొడవ పడుతుంటే తల్లులు మాత్రం కన్ఫ్యూజన్‌లో పడిపోతారు. ఈ గందరగోళానికి ముంబైకి చెందిన ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ కునాల్ సైంటిఫిక్‌గా, సూటిగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏ పాలు మంచివని చెబుతున్నారో తెలుసుకుందాం..
ఏవి మంచివి..
6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ఆవు పాలే బెస్ట్ ఛాయిస్. ఆ తర్వాత కూడా ఆవు పాలకే ప్రాధాన్యం ఇవ్వండి అంటున్నారు డాక్టర్ కునాల్. ఎందుకంటే, ఆవు పాలలో ఫ్యాట్ కంటెంట్ తక్కువ, ప్రోటీన్ సులభంగా జీర్ణమవుతుంది, లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎనర్జీ త్వరగా లభిస్తుంది. ముఖ్యంగా ఆవు పాలలో ఉండే A2 కేసిన్ పిల్లలకు సులువుగా అరుగుతుంది. అలర్జీ, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు చాలా అరుదుగా వస్తాయి.
గేదె పాలల్లో ఫ్యాట్ దాదాపు రెట్టింపు, ప్రోటీన్ ఎక్కువ, కాల్షియం ఎక్కువ.. ఇవన్నీ మంచివే కానీ చిన్న పిల్లల కడుపు దాన్ని జీర్ణం చేసుకోవడానికి కష్టపడుతుంది. A1 కేసిన్ వల్ల కొందరిలో మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ‘గేదె పాలు ఇవ్వాలంటే 2 ఏళ్లు పైబడిన తర్వాతే, అది కూడా సగం నీళ్లు కలిపి మాత్రమే.’ ఇవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్ కునాల్.
రోజుకు 400–500 మి.లీ. పైగా పాలు ఇస్తే ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పాలతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, గుడ్లు, ధాన్యాలు కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఇవ్వాలి. దొరికితే దేశీ ఆవు పాలే అత్యుత్తమం. ప్యాకెట్ పాలలో ఎక్కువగా A1 కేసిన్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ దేశీ ఆవు పాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ‘పిల్లలకు ఆవు పాలు సేఫ్, ఈజీ డైజెస్టిబుల్, లాంగ్ టర్మ్‌లో బెస్ట్.’ అనేది కునాల్ సలహా. ఇకపై పాల ఎంపికలో ఎటువంటి సందేహం లేకుండా… మీ పిల్లలకు సరైన పోషణ అందించండి!
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.




