Bad cholesterol: చెడు కొలెస్ట్రాల్ నుంచి మీ గుండెను కాపాడే ఆయుధాలివి.. వీటిని తినడం అస్సలు మరువకండి..
చెడు కొలెస్ట్రాల్ అనేది ఈరోజుల్లో గుండెకు ముప్పు తెచ్చే ప్రధాన సమస్యగా మారిపోయింది. మనం చేసే పొరపాట్లే ఇందుకు కారణం. ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివన్నీ కూడా కొలెస్ట్రాల్ ముప్పును పెంచుతున్నాయి. మరి దీని నుంచి ముందే అప్రమత్తంగా ఉండేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు మీకు సాయపడతాయి. అవేంటో చూసేయండి...

మనం తీసుకునే ఆహారంమీదనే శారీరక మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే అది కొలెస్ట్రాల్ గా మారి మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో ఈ కొవ్వు చేరి గుండెకు రక్తాన్ని సరిగ్గా చేరనీయదు. ఫలితంగా గుండెకు ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటుండాలి. ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు తగ్గించేస్తుంటాయి. మరి మీ గుండెకు మేలు చేసే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో చూసేయండి.
ఓట్స్
ఓట్స్‌లో కరిగే ఫైబర్ (బీటా-గ్లూకాన్) ఉంటుంది. ఈ ఫైబర్, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ ఫైబర్ కారణంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అదేవిధంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
బెండ కాయ
బెండకాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బెండకాయలు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు బెండకాయలో పెక్టిన్ అనే ఓ రకమైన ప్రత్యేక ఫైబర్ ఉంటుంది. ఈ పదార్థం చెడు కొలెస్ట్రాల్ ను అడ్డుకోగలదు.
ఆలివ్ నూనె
ఆలివ్ ఆయిల్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం, జుట్టు చక్కగా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఆలివ్ నూనెను ఉపయోగించడం ఉత్తమం. ఆలివ్ నూనెను ఆహారంలో ఉపయోగించడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చేపలు
చేపల్లో గుండె అనారోగ్యాన్ని అడ్డుకునే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో సాయపడుతుంది. ఈ చేపల్ని తినడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో పాటు బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మీకు సాల్మన్, టునా, మాకెరెల్ వంటి చేపల్లో దొరుకుతుంది. కాబట్టి, వీటిని తింటే హ్యాపీగా కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు.
పండ్లు
తాజా పండ్లు కూరగాయలు ప్రతి ఒక్కరి డైట్లో ఉండాల్సిన పదార్థాలు. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడేవారికి కొన్నిరకాల పండ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు యాపిల్స్ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పియర్‌లో లిగ్నిన్ మెండుగా ఉంటుంది, ఇది కరగని ఫైబర్. లిగ్నిన్ శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
మెంతులు
ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. దీని ద్వారా షుగర్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా కాపాడవచ్చు.
బీన్స్
రోజు 180 గ్రాముల వివిధ రకాల బీన్స్ తినడం వల్ల ఒంట్లో పెరుగుతున్న కొలెస్ట్రాల్ స్థాయిల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉండి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయపడుతుంది.
నట్స్
కొన్ని రకాల నట్స్, ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, మరియు కనోలా నూనె వంటివి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మరియు ఫైబర్‌ను కలిగి ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆవకాడో
అవకాడో నూనె మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండిన అవోకాడో ఆయిల్ గుండెను బలోపేతం చేస్తుంది. ఈ నూనెలో లుటిన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటాయి. పెరిగిన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడానికి అవొకాడో ఆయిల్ ను ఉపయోగించవచ్చు.




