చికెన్ Vs మటన్.. షుగర్ ఉన్నవారికి ఏది మంచిదో తెలుసా..?
Chicken vs Mutton: షుగర్ వచ్చిందంటే చాలు.. ఆహారపు అలవాట్లపై యుద్ధం మొదలైనట్లే. ఏది తినాలన్నా భయం, ఏది ముట్టుకున్నా షుగర్ లెవల్స్ పెరుగుతాయేమోనన్న ఆందోళన. ముఖ్యంగా మాంసాహార ప్రియుల పరిస్థితి మరీ దారుణం. పండగ వచ్చినా, ఆదివారం వచ్చినా ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చికెన్, మటన్లలో ఏది మంచిది..? అనేది తెలుసుకుందాం..

నేటి కాలంలో షుగర్ అనేది ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. ముఖ్యంగా మాంసాహారం తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక పెద్ద సందేహం ఉంటుంది.. చికెన్ తింటే మంచిదా? లేక మటన్ తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్
మటన్ అనేది రెడ్ మీట్ కేటగిరీకి చెందుతుంది. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. మటన్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మటన్‌ను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు కానీ చాలా మితంగా తీసుకోవడం ఉత్తమం.
చికెన్
మటన్‌తో పోలిస్తే చికెన్ షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు. చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉంటుంది. చికెన్ తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా ఇతర కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా నియంత్రిస్తుంది.
వండే పద్ధతిలోనే అసలు రహస్యం ఉంది
చికెన్ మంచిదే కదా అని చికెన్ ఫ్రైలు, మసాలా దట్టించిన కర్రీలు తింటే ఫలితం రివర్స్ అవుతుంది. నూనెలో బాగా వేయించిన చికెన్, నెయ్యి లేదా క్రీమ్ కలిపిన గ్రేవీలు అస్సలు మంచివి కావు. ఉడికించిన చికెన్, గ్రిల్డ్ చికెన్ లేదా తక్కువ నూనెతో వండిన కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్కిన్లెస్ చికెన్ ఇంకా మంచిది.
మొత్తం మీద చూస్తే, డయాబెటిస్ ఉన్నవారికి మటన్ కంటే చికెన్ సురక్షితమైన ఎంపిక. అయితే ఏ మాంసాహారమైనా పరిమితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఆహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




