Weight Loss Tips: నీళ్లు మస్తు తాగితేనే బరువు తగ్గుతారట.. ఎలాగో తెలుసా..?
తక్కువ కేలరీలు తీసుకోవాలన్నా, శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పంపాలన్నా, వాటర్ తాగడం ఒక అద్భుత ఆయుధంలా పనిచేస్తుంది. నిపుణుల మాటల ప్రకారం సరైన సమయంలో, సరైన పద్ధతిలో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది. అయితే నీరు తాగడంలో కొన్ని సరైన నిబంధనలు పాటిస్తేనే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే అది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించి శుభ్రపరిచే ప్రక్రియను ప్రారంభిస్తుంది. శరీరం పూర్తిగా హైడ్రేట్ అవుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది. శరీర శుద్ధి త్వరగా జరుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు మొదటి అడుగు.
ఆహారం తీసుకునే ముందు సుమారు 20 నుంచి 30 నిమిషాల ముందుగా ఒక గ్లాసు నీరు తాగితే అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరం తినబోయే ఆహారాన్ని సరిగా జీర్ణించుకునే విధంగా తయారవుతుంది. ఇది ఆకలిని కూడా కొంత నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల ఎక్కువగా తినే అవకాశాలు తగ్గుతాయి.
చాలా మందికి భోజనం సమయంలో ఎక్కువగా నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు పలచబడి, ఆహారం సరిగ్గా జీర్ణం కావడంలో ఆటంకం కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో శరీరం ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసుకోలేదు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
వ్యాయామానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం తక్కువ సమయంలో హైడ్రేట్ అవుతుంది. ఇది కండరాల పనితీరును మెరుగుపరచడమే కాదు.. శక్తిని కూడా పెంచుతుంది. దాంతో పాటు వర్కౌట్ సమయంలో ఒంట్లో తేమ సమతుల్యంలో ఉండి, అలసట తగ్గుతుంది. అలాగే వర్కౌట్ తరువాత కండరాల పునరుద్ధరణను వేగవంతం చేస్తుంది.
నీరు తాగడం అనేది కేవలం దాహం తీర్చడానికి మాత్రమే కాదు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కానీ సరైన సమయంలో, సరైన మోతాదులో తాగడం వల్లే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఉదయాన్నే, భోజనానికి ముందు, వ్యాయామానికి ముందు ఇలా సమయాన్ని బట్టి నీరు తాగితే బరువు తగ్గే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.




