Summer Care Tips: వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలనే.. ఈ వీలైంత వరకూ ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
వేసవిలో రోజు రోజుకీ భానుడు భగభగ మండుతున్నాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. హీట్ స్ట్రోక్ బారిన పడవచ్చు. ఈ నేపధ్యంలో వడ దెబ్బ నుంచి ఉపశమనం కోసం తినే ఆహారంలో కొన్నిటిని చేర్చుకోవాలి. అదే విధంగా ఎంత ఇష్టమైన సరే ఈ సమయంలో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వేసవిలో పొరపాటున కూడా ఈ ఐదు రకాల ఆహారాలు తినొద్దు..

వేసవికాలంలో తీవ్రమైన ఎండ కారణంగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. వేడి గాలులు వీచడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. వడదెబ్బను నివారించడానికి శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్న నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంపై అత్యధికంగా శ్రద్ధ చూపడం అవసరం. అందుకే వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు కీర దోసకాయ, ఉల్లిపాయ, పుచ్చకాయ, తాటి ముంజెలు వంటి వాటిని ఎక్కువగా తింటారు. అయితే కొన్ని ఆహారాలను ఇష్టం అంటూ తినడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. అంతేకాదు హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
వడదెబ్బ తగిలినప్పుడు, వేగంగా శ్వాస తీసుకోవడం, విశ్రాంతి లేకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వాంతులు, వికారం, విరేచనాలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు. వడదెబ్బను నివారించడానికి వీలైనంత తక్కువగా ఎండలో బయటకు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కనుక శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడేలా చేసే ఆహారాలు ఏమిటో తెలుసుకోండి. వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండండి.
శీతల పానీయాలు: వేసవి కాలంలో ప్రజలు శీతల పానీయాలను ఎక్కువగా ఇష్టంగా తాగెస్తారు. ఎందుకంటే ఇవి శరీరానికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. వేసవిలో ప్రతిరోజూ శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడే వారిలో మీరు కూడా ఉంటే.. వెంటనే ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే శరీరం హైడ్రేటెడ్ గా మారడానికి బదులుగా డీహైడ్రేషన్ బారిన పడి వడ దెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది.
కెఫిన్ ఉన్న వస్తువులు: ఉష్ణోగ్రత ఎంత పెరిగినా టీ, కాఫీని అలవాటుని వదులుకోలేమని టీ, కాఫీ ప్రియులు తరచుగా చెబుతూ ఉంటారు. టీ , కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇవి తాగడం వలన శరీరం డీహైడ్రేట్ బారిన పడుతుంది. కనుక వేసవిలో టీ , కాఫీని చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
అధిక ఉప్పు కలిగిన ఆహారాలు: ఏ సీజన్ లోనైనా సరే ఆరోగ్యంగా ఉండటానికి ఉప్పు తక్కువగా తినడం మంచిది. అయితే వేసవిలో ఈ ఉప్పు ఉన్న ఆహరాన్ని వీలైనంత వరకూ తగ్గించి తినాలి. ముఖ్యంగా చిప్స్, నమ్కీన్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. కనుక శరీరంలోకి తక్కువ మొత్తంలో సోడియం ప్రవేశించేలా చూసుకోవాలి.
బాగా వేయించిన ఆహారాలు: వేసవిలో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు జీర్ణం కావడానికి కష్టంగా ఉంటాయి. దీని కారణంగా కడుపులో భారమైన భావన ఉంటుంది. నిర్జలీకరణం కూడా సంభవించవచ్చు. నిజానికి వేయించిన ఆహారం జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా నీరు అవసరం.
కారంగా ఉండే నూనె ఆహారాలు: వేసవిలో తినే ఆహారంలో ఊరగాయలు, కొవ్వు, కారంగా ఉండే ఆహారాలు, నాన్-వెజ్, మసాలా పాపడ్ మొదలైన వాటిని తక్కువగా చేర్చుకోవాలి. వీటిని తిన్న తర్వాత డీహైడ్రేషన్ కు గురవుతారు. ఈ ఆహారాలు తిన్న తర్వాత మీకు మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. ఇది నిర్జలీకరణానికి సంకేతం.
వేటిని తినే ఆహారంలో చేర్చుకోవాలంటే… వేసవిలో వడదెబ్బను నివారించడానికి కీర దోసకాయ, పుచ్చకాయ వంటి వాటిని ఎక్కువగా తినాలి. తినే భోజనంలో సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయలు కూడా రోజూ తినాలి. దీనితో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుదీనా రసం, సోంపు రసం వంటి పానీయాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)