జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోవడానికి అసలు కారణాలు ఇవే.. ఇలా చేస్తే మీ వెంట్రుకలు సేఫ్..
మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కార్టిసాల్, ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావంతో హెయిర్ ఫోలికల్స్ బలహీనపడతాయని పేర్కొంటున్నారు. మెడిటేషన్, ప్రాణాయామం, పోషకాహారం, కొబ్బరి నూనె, మునగ నూనె వంటి సహజ మార్గాలతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

నేటి ఆధునిక జీవనశైలిలో అనేక మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టు రాలడం ఒకటి.. చిన్నా పెద్దా.. వయస్సు భేదం లేకుండా చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా కొందరికీ.. చిన్నతనంలోనే బట్టతల వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది నిపుణులు.. “స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ” అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. మానసిక ఒత్తిడికి, జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోవడానికి మధ్య ఉన్న సంబంధాన్ని పలు రకాలుగా వివరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ రోజుల్లో చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి, ఆందోళన.. వీటి కారణంగా జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోవడం సర్వసాధారణంగా మారిందని.. దానిని నివారించడానికి సహజ పరిష్కారాలను అవలంభించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడితో జుట్టు రాలడానికి రెండు ప్రధాన కారణాలు:
కార్టిసాల్ ప్రభావం:
మనసులో ఒత్తిడి, ఆందోళన పెరిగినప్పుడు, శరీరంలో “కార్టిసాల్” అనే స్ట్రెస్ హార్మోన్ అధిక మొత్తంలో విడుదలవుతుంది. వాస్తవానికి, కార్టిసాల్ శరీరానికి అవసరమైన ఒక హార్మోన్, ఇది రోజువారీగా తయారవుతుంది. కానీ ఒత్తిడి పెరిగినప్పుడు, ఇది మోతాదుకు మించి ఉత్పత్తి అవుతుంది. అధిక కార్టిసాల్ స్థాయిలు జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే కణజాలాన్ని (హెయిర్ రూట్స్ దగ్గర ఉండే సెల్స్) ప్రభావితం చేస్తాయి. ఇది కణాలకు తప్పుడు సంకేతాలను పంపి, “అపోప్టోసిస్” అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అపోప్టోసిస్ అంటే కణాలు వాటంతట అవే చనిపోవడం. ఈ విధంగా జుట్టు కుదుళ్ళ దగ్గర కణాలు దెబ్బతిని చనిపోవడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలహీనపడతాయి. కొత్త కణాలు ఉత్పత్తి కాకుండా, ఉన్న కణాలు చనిపోవడం వల్ల జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంది.
ఆండ్రోజెన్ హార్మోన్ల ప్రభావం:
ఒత్తిడి ఎక్కువైనప్పుడు, మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథుల నుండి “ఆండ్రోజెన్” హార్మోన్లు కూడా అధిక మొత్తంలో విడుదలవుతాయి. సాధారణంగా, ఒక వెంట్రుక ఊడిపోయిన తర్వాత, ఆ స్థానంలో కొత్త వెంట్రుక తిరిగి పెరగడానికి దాదాపు 20-21 రోజుల “రెస్టింగ్ పీరియడ్” అవసరం. అంటే, జుట్టు కుదురు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కొత్త వెంట్రుకను పునరుత్పత్తి చేస్తుంది. అయితే, అధిక ఆండ్రోజెన్ హార్మోన్లు ఈ రెస్టింగ్ పీరియడ్‌ను గణనీయంగా పెంచుతాయి. 20 రోజుల విశ్రాంతి బదులు, జుట్టు కుదురు 30-40 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం రెస్టింగ్ పీరియడ్‌లోకి వెళ్ళిపోతుంది, దీనివల్ల కొత్త వెంట్రుకలు పెరగవు. ఫలితంగా జుట్టు పలుచబడుతుంది. అంతేకాకుండా, ఆండ్రోజెనిక్ హార్మోన్ల ప్రభావం వల్ల ఆరోగ్యంగా ఉన్న వెంట్రుకలు కూడా త్వరగా రాలిపోయి, జుట్టు కుదురు రెస్టింగ్ పీరియడ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రెండు హార్మోన్ల ప్రభావం వల్లనే ఒత్తిడి, ఆందోళన జుట్టు రాలడానికి ప్రధాన కారణాలవుతున్నాయి.
పరిష్కార మార్గాలు:
ఈ స్థితి నుండి బయటపడాలంటే, స్ట్రెస్ హార్మోన్లను తగ్గించడం అత్యవసరం. దీనికి కొన్ని సమర్థవంతమైన సహజ పద్ధతులను అవలంభించవచ్చు..
మెడిటేషన్ (ధ్యానం) – ప్రాణాయామం: ధ్యానం, ప్రాణాయామం ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి. పూర్వకాలంలో యోగులు, ఋషులు సుదీర్ఘమైన జుట్టును కలిగి ఉండేవారు, దీనికి వారి ధ్యాన జీవనశైలి, ఒత్తిడి లేని స్థితి ఒక కారణం. మెడిటేషన్, ప్రాణాయామం స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
సహజ ఆహారం: స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, “హ్యాపీ హార్మోన్స్” (డోపమిన్, సెరటోనిన్, గాబా) ఉత్పత్తిని పెంచే సహజ ఆహారం చాలా ముఖ్యం. ప్రేగులలో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటే, ఈ హ్యాపీ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. నట్స్, అధిక ప్రొటీన్, అధిక ఫైబర్ గల ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది, చెడు బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా ద్వారా విడుదలయ్యే హ్యాపీ హార్మోన్లు స్ట్రెస్ హార్మోన్ల స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇంకా జుట్టు ఊడకుండా ఉండేందుకు నూనెలు కూడా ఉపయోగించవచ్చు.. కొబ్బరినూనె అలాగే.. మునగనూనె లాంటివి ఉపయోగించవచ్చు..
మీరు ఆశించిన విధంగా జుట్టు పెరగడానికి, రాలకుండా ఉండటానికి, జుట్టు కుదుళ్లు దృఢంగా ఉండటానికి ఈ ప్రయత్నాలు చాలా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ సమస్యను ఎదుర్కొంటుంటే.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
