AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : లార్డ్స్ మైదానంలో హిట్ మ్యాన్ సెంచరీ.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు

Rohit Sharma :లార్డ్స్ వేదికగా రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీతో రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న హిట్‌మ్యాన్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక స్పష్టత ఇచ్చింది. 2027 ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rohit Sharma : లార్డ్స్ మైదానంలో హిట్ మ్యాన్ సెంచరీ.. సచిన్, కోహ్లీలకు కూడా సాధ్యం కాని అరుదైన రికార్డు
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 20, 2026 | 10:53 AM

Share

Rohit Sharma : గత కొన్ని రోజులుగా భారత క్రికెట్‌లో ఎక్కడ చూసినా ఒకే ఒక్కరి పేరు వినబడుతోంది.. ఆయనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే ఓటమి అనంతరం బీసీసీఐ సెలెక్టర్లు ఆయనను పక్కన పెట్టాలని చూస్తున్నారని, ఇకపై వన్డేల్లో ఆయనకు స్థానం ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. ఒక రకంగా ఆదివారం లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే ఆయనకు చివరి మ్యాచ్ కానుందనే వార్తలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ విమర్శలన్నింటికీ రోహిత్ శర్మ తన బ్యాట్‌తోనే గట్టి సమాధానమిచ్చాడు. లార్డ్స్ చారిత్రాత్మక మైదానంలో సంచలన శతకం బాది, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల వల్ల కూడా కాని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

రిటైర్మెంట్ పుకార్లకు సెంచరీతో కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ

లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. గతంలో 2004లో సౌరవ్ గంగూలీ చేసిన 90 పరుగులే ఇక్కడ భారత బ్యాటర్ చేసిన అత్యధిక వన్డే స్కోరుగా ఉండేది. 39 ఏళ్ల 80 రోజుల వయసులో లార్డ్స్ వేదికగా వన్డే సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా, అంతర్జాతీయంగా ఇక్కడ సెంచరీ సాధించిన అత్యంత సీనియర్ భారతీయ క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరఫున ఒంటరి పోరాటం చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించాడు.

రోహిత్ శర్మ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది

రోహిత్ శర్మ తుది మ్యాచ్ ఆడుతున్నాడనే ప్రచారం విపరీతంగా పెరిగిపోవడంతో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా స్పందించారు. “రోహిత్ శర్మ ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం జట్టులో ఉంటాడు. ఆయన రిటైర్మెంట్‌పై వస్తున్న పుకార్లలో నిజం లేదు. లార్డ్స్ వన్డే ఆయనకు ఆఖరి మ్యాచ్ కానే కాదు” అని స్పష్టం చేశారు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ శర్మ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బుమ్రా లేకపోవడంతో తేలిపోయిన భారత బౌలింగ్ విభాగాలు

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. మోకాలి గాయం కారణంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం భారత బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అనుభవం లేని ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్‌లతో కూడిన పేస్ విభాగం ఇంగ్లీష్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91) కలిసి తొలి వికెట్‌కు 192 పరుగుల కొండంత భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నారు.

కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాల్లో భాగంగా కేవలం అక్షర్ పటేల్ రూపంలోనే రెండో స్పిన్నర్ ఉండటం, కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కకపోవడం కూడా భారత్‌ను దెబ్బతీసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టింది. రోహిత్ శర్మ వీరోచిత పోరాటం చేసినప్పటికీ, సరైన భాగస్వామ్యాలు లభించకపోవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా, 1-2 తేడాతో వన్డే సిరీస్‌ను ఇంగ్లాండ్‌కు అప్పగించాల్సి వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us