Andhra Pradesh: దంచికొట్టే ఎండలతో జాగ్రత్త సుమా.! వేసవి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు.
మార్చి నెల ఇలా మొదలైందో లేదో అలా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటే భపడే పరిస్థితులు మొదలవుతున్నాయి...
మార్చి నెల ఇలా మొదలైందో లేదో అలా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటే భపడే పరిస్థితులు మొదలవుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. వడదెబ్బ లక్షణాలు ఏంటి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి వివరాలు మీకోసం..
వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* తలనొప్పి,తల తిరగడం, తీవ్రమైన జర్వం కలిగియుండటం మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.
* స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. టీవి చూడండి, రేడియో వార్తలు వినండి, వార్తాపత్రికలు చదవండి.
* నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
* వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి.
* ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగాలి.
* వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.
* ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని , నిమ్మరసముగాని, కొబ్బరినీరు గాని తాగాలి.
* తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.
* ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి.
* తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి.
* మేడపైన మొక్కలు, ఇంట్లోని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడని పనులు..
* ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో నలుపురంగు,మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
* మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు.
* బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది.
* శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్దాలను తీసుకోవద్దు.
* ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి.
* ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకొనకూడదు.
* ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు, కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేలా చూసుకోండి.
* వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..