గురుగ్రామ్‌లో మరో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం
దేశంలో ఎన్ని చట్టాలు చేసిన మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని అమాయకులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
దేశంలో ఎన్ని చట్టాలు చేసిన మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని అమాయకులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్‌లో దళిత యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటన మరువక ముందే మరో ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. హాత్రాస్ ఘటనపై యావత్ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలోనూ హర్యానాలో అదే తరహా ఘటన జరగడం విషాదకరం.
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ 25 ఏళ్ల యువతిపై నలుగురు దుండగులు దాడిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి తలకు బలమైన గాయాలయ్యాయి. గురుగ్రామ్ ఏసీపీ కరణ్ గోయల్ వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన యువతి శనివారం రాత్రి గురుగ్రామ్‌లోని సికందర్‌పుర్ మెట్రోస్టేషన్ వద్ద రైలు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో యువతి వద్దకు వచ్చిన ఓ యువకుడు ఈ సమయంలో రైళ్ల రాకపోకలు ఉండవని నమ్మబలికి ఆమెను డీఎల్‌ఎఫ్ ఫేస్-2లోని ఓ కాంప్లెక్స్ వద్దకు తీసుకెళ్లాడు. ఈ విషయం అతని స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో అప్పటికే అక్కడి మరో ముగ్గురు యువకులు చేరుకున్నారు. వారిని చూసి భయపడిన యువతి అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. యువతిని అడ్డుకున్న నలుగురు కిరాతకులు ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దాడిచేసి, తలపై రాయితో మోది అత్యాచారానికి ఒడిగట్టారు కసాయి కీచకులు. అనంతరం అక్కడినుంచి దుండగులు పారిపోయారు.
బాధితురాలి ఏడుపులు విన్న కాంప్లెక్స్ వాచ్‌మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని గురుగ్రామ్ ఏసీపీ కరణ్ గోయల్ తెలిపారు. ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. నిందితులంతా 20 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన యువకులేనని ఏసీపీ వివరించారు.