AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. నిండు కుండల్లా జలాశయాలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

Weather: ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. నిండు కుండల్లా జలాశయాలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
Ap, Telangana Heavy Rains
Balaraju Goud
|

Updated on: Jul 21, 2021 | 9:32 AM

Share

 AP, Telangana Heavy Rains Alert: రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,10,239 ఉండగా ఔట్‌ఫ్లో 28,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 31,512, ఔట్‌ఫ్లో 1,555 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక, జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో అధికారులు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ ఫ్లో 87 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,10,556 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 316.790 మీటర్లకు చేరుకుంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుతం 6.38 టీఎంసీలకు చేరుకుంది.

అటు, కర్నూలు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు సంగమేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. దీంతో సంగమేశ్వర ఆలయంలో వరద జలాలు శివలింగాన్ని తాకాయి. సంగమేశ్వర ఆలయంలో అర్చకులు అంత్య పూజలు నిర్వహించారు. వరద జలాలు ఆలయంలోకి చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 533.60 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను..ప్రస్తుతం 175.2598టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 28,252 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 500 క్యూసెక్కులుగా ఉంది.

మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 45,190 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 34,720 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 9.166 టీఎంసీలుగా కొనసాగుతోంది.

కాగా, ఏపీ,తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతుంటే… బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి తెలంగాణలో అతి భారీవర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రాత్రి నుంచి హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం పడుతోంది.

ఇటు, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి జోరు వాన కురుస్తోంది. నారుమడి టైమ్‌లో వర్షం పడడంతో వరిచేలు నీటమునుగుతున్నాయి. కాలువలు డ్రైన్లు బాగుచేయకపోవడంతో ఇప్పటికే ముమ్మడివరం మండలంలో క్రాప్‌హాలిడే ప్రకటించారు రైతులు.

Read Also… Mangli Bonalu Song: సింగర్ మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. అభిమానుల రచ్చతో ఏం చేసిందంటే..?