జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణకై డిమాండ్ చేశాం… కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని తాము కోరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాశ్మీర్ పై ప్రధాని మోదీ గురువారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో 14 పార్టీల నేతలు పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని తాము కోరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాశ్మీర్ పై ప్రధాని మోదీ గురువారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో 14 పార్టీల నేతలు పాల్గొన్నారు. సుమారు 3 గంటల సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన ఆజాద్…సాధ్యమైనంత త్వరగా కాశ్మీర్ కి రాష్ట్ర హోదాను కల్పించాలని కోరామన్నారు. ముఖ్యంగా 5 డిమాండ్లను ఆయన ముందు ఉంచామన్నారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తాను..హోం మంత్రి అమిత్ షా ఇదివరకే పార్లమెంటులో హామీ ఇచ్చినట్టు ప్రధాని తెలిపారని ఆజాద్ చెప్పారు. అయితే ఇదే సరైన సమయమని తాము ఆయనకు చెప్పామన్నారు. ఇంకా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా త్వరగా ఎన్నికలు జరపాలని, కాశ్మీర్ పండిట్లను తిరిగి రప్పించి వారికి పునరావాసం కల్పించాలని, 2019 ఆగస్టు 5 న అరెస్టు చేసిన సామాజిక కార్యకర్తలను, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనీ, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తాము ప్రధానంగా కోరినట్టు అయన చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న 14 పార్టీల ప్రతినిధులు, నేతలు అంతా ఇంచుమించు ఇవే కోర్కెలను ప్రస్తావించినట్టు గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈ మీటింగ్ లో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తో బాటు ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా మొదట ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో నియోజకవర్గాల పునర్వర్గీకరణ జరగాలని, రాజకీయ ప్రక్రియ ప్రారంభం కావాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సుముఖంగానే ఉన్నట్టు ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.. మొత్తానికి ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి మళ్ళీ కొత్త రాజకీయ ప్రక్రియకు ప్రధాని శ్రీకారం చుట్టారని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics: భారత మహిళా హాకీ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా రాణి రాంపాల్ ఎంపిక
యూపీలో దారుణం…జామకాయలు కోసినందుకు ఇద్దరు దళిత పిల్లలను చెట్టుకు కట్టేసి కొట్టిన కసాయి