ఎక్కడ చూసినా శ్వేత వర్ణమే, అగ్రరాజ్యాన్ని ముంచెత్తుతోన్న మంచు తుఫాన్లు.. 75 సెంటీ మీటర్ల మేర కప్పేస్తూ కొత్త రికార్డులు

అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్‌ ముంచెత్తుతోంది. శీతాకాలం క్రిస్మస్‌ ముంగిట అమెరికా ఈశాన్య రాష్ట్రాలు హిమపాతం గుప్పిట్లో చిక్కుకున్నాయి..

ఎక్కడ చూసినా శ్వేత వర్ణమే, అగ్రరాజ్యాన్ని ముంచెత్తుతోన్న మంచు తుఫాన్లు.. 75 సెంటీ మీటర్ల మేర కప్పేస్తూ కొత్త రికార్డులు
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 19, 2020 | 8:20 AM

అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుఫాన్‌ ముంచెత్తుతోంది. శీతాకాలం క్రిస్మస్‌ ముంగిట అమెరికా ఈశాన్య రాష్ట్రాలు హిమపాతం గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా దట్టమైన మంచు దుప్పటిని కప్పేసినట్లు కనిపిస్తోంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీతో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్ ప్రాంతాల్లో హిమపాత ప్రభావం అధికంగా కనిపిస్తోంది.. ఎక్కడ చూసినా శ్వేత వర్ణమే కనిపిస్తోంది. రోడ్ల మీద మోకాలు లోతు మంచు కూరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల రోడ్డు సరిగ్గా కనిపించక వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఇళ్ల పైకప్పులతో పాటు చెట్లూ, రోడ్లు, కరెంటు స్థంబాలను కూడా మంచు దప్పటి కప్పేస్తోంది. ఇళ్ల ముందు రోడ్ల మీద పార్క్‌ చేసిన వాహనాలు మంచులో కూరుకుపోయి కనిపించడం లేదు. వాహనాల యజమానులు మంచును తొలగిస్తున్నారు.

మరోవైపు దట్టంగా పేరుకున్న మంచు ఆహ్లాదాన్ని పంచుతోంది. స్థానికులు మంచులో ఆటలాడుతూ, స్కేటింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో మంచు తీవ్రత కారణంగా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురుస్తోంది. న్యూయార్క్‌లోని మన్‌హాటన్‌ నగరం, గ్లేన్​విల్లా ఆల్బే ప్రాంతాల్లో 75 సెంటీ మీటర్ల మేర మంచు కప్పేసింది. పారిశుధ్య సిబ్బంది ప్రత్యేక వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు మంచును తొలగిస్తున్నారు. మంచు తుఫాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. చాలా వరకూ విమానాలు, రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.