జగన్ విజయంలో ‘కీ’ రోల్.. అతనో విజయ కిషోరం
41 రోజుల ఉత్కంఠకు తెరపడింది. సర్వత్రా ఆసక్తిని రేపిన ఏపీ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్‌కు అతీతంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఏపీలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఇదంతా పక్కన పెడితే ఏపీలో జగన్ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ వ్యూహం వైసీపీకి వరంగా మారింది. తన టీంతో పీకే దాదాపు నాలుగేళ్లుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైసీపీకి […]
41 రోజుల ఉత్కంఠకు తెరపడింది. సర్వత్రా ఆసక్తిని రేపిన ఏపీ ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్‌కు అతీతంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో ఏపీలో కొత్త శకం ప్రారంభం కానుంది. ఇదంతా పక్కన పెడితే ఏపీలో జగన్ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ వ్యూహం వైసీపీకి వరంగా మారింది. తన టీంతో పీకే దాదాపు నాలుగేళ్లుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఆ పార్టీ వేసే ప్రతి ముందడుగులోనూ తనదైన శైలిని చూపుతూ వచ్చారు. ఆయన రచించిన వ్యూహాలు జగన్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసి, వారి అభిమానాన్ని చూరగొనేలా చేశాయి. నిజానికి చెప్పాలంటే ఏపీలో వైసీపీ ఘన విజయంతో.. ‘‘పీకే ఎవరి వెంట ఉంటే విజయం వారిదే ’’ అన్నది మరోసారి స్పష్టంగా నిరూపితమైంది. అయితే అసలు ఎవరీ పీకే..? రాజకీయాల్లోకి ఆయన ఎందుకు వచ్చారు..? ఆయన ప్లాన్ వేస్తే తిరుగుండదా..?
ప్రశాంత్ కిశోర్.. ఎనిమిదేళ్లు అమెరికాలో పనిచేసిన ఆయన ఆ తరువాత భారత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అందరిలా ఓ పార్టీలో చేరకుండా.. నాయకుల వెనకుండి వారిని గెలిపించే బాధ్యతలు తీసుకున్నానే. ఈ నేపథ్యంలో 2011లో మోదీ మూడోసారి గుజరాత్ సీఎంగా విజయం సాధించేందుకు ఆయన వేసిన వ్యూహం ఘన విజయం సాధించింది. అదే ప్రశాంత్‌ను మోదీకి మరింత దగ్గర చేసింది. దీంతో 2014లో తనను గెలిపించే బాధ్యతలు ఆయనకే ఇచ్చారు మోదీ. అప్పుడు కూడా ప్రశాంత్ తన నమ్మకాన్ని నిలబెట్టుకొని మోదీకి భారి విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ సమయంలోనే పీకే మొదటిసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు.
ఆ తరువాత 2015లో బీహార్‌లో నితీశ్ కుమార్ మూడోసారి అధికారం చేపట్టేందుకు ఆయన వేసిన వ్యూహాలు విజయం సాధించాయి. ఒక సమయంలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్.. పీకేను ‘ఫాక్టో సీఎం’ అంటూ అభివర్ణించడం పతాక శీర్షికలకెక్కింది. అలాగే 2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలోనూ పీకే.. కీలక పాత్ర పోషించారు. అయితే 2017లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వ్యూహం బెడిసికొట్టింది. అక్కడ కాంగ్రెస్, ఎస్పీ కూటమి కోసం ఆయన వేసిన ప్లాన్‌లు దారుణంగా దెబ్బకొట్టి.. 27సంవత్సరాలుగా రాష్ట్రంలో సుదీర్ఘంగా ఉన్న ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చూసేలా చేశాయి. దీంతో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి. పలువురు నాయకులు ఆయనపై ప్రత్యక్షంగానే కామెంట్లు చేశారు. కానీ పీకే రాజకీయ చతురత తెరవెనుక ఫలితాలను ఇస్తూ వచ్చింది.
అలాంటి సమయంలో వైఎస్ జగన్‌కు దగ్గరయ్యారు పీకే. ఈ ఎన్నికల్లో తనకు విజయం కచ్చితంగా కావాల్సిందేనన్న జగన్ ఆశలకు తగ్గట్లుగా ఆయన వ్యూహాలు రచించారు. 709 రోజులు, 35కు పైగా క్యాంపైన్లను ఆయన ప్లాన్ చేశాడు. అలాగే నవరత్నాలు, సుదీర్ఘ పాదయాత్ర వంటి కాన్సెప్ట్‌లను జగన్‌కు సూచించారు. ముఖ్యంగా సంస్థాగతంగా వైసీపీని బలోపేతం చేయడంలో పీకే టీం విజయం సాధించింది. ఇక డిజిటల్ పరంగానూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు పీకే. ఇవన్నీ వైసీపీకి విజయాన్ని ఇచ్చి.. జగన్ తన కలను నిజం చేసుకునేలా చేశాయి. మొత్తానికి ఈ విజయంతో ‘తమకు విజయం కావాలి’ అనుకున్న ప్రతి ఒక్కరూ ఆయన పేరునే స్మరించుకునేలా చేశారు ప్రశాంత్ కిశోర్. కాగా ప్రస్తుతం పీకే.. ఓ వైపు పలువురికి స్ట్రాటెజీలు రచిస్తూనే.. జేడీయూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.