AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసం కీడు చేస్తుంది..!

A Moral Story: "కపటబుద్ధి" అనే ఈ పంచతంత్ర నీతి కథ ద్వారా దుష్టుల సావాసం ఎలాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుందో మనకు అర్థమవుతుంది. పైకి నమ్మకంగా నటిస్తూ లోపల కుతంత్రాలు ఆలోచించే నక్క మాటలు నమ్మి, అమాయకపు ఒంటె తన ప్రాణాలనే ఎలా కోల్పోయిందో ఈ కథలో తెలుస్తుంది. నీతి కథలు వినదం కోసమే కాదు.. పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు దోహదపడుతుంది.

నీతి కథ: నక్క కుతంత్రానికి ఒంటె బలి.. దుష్టుల సావాసం కీడు చేస్తుంది..!
Fox Camel Lion A Moral Story
Janardhan Veluru
|

Updated on: May 21, 2026 | 7:24 PM

Share

నీతి కథలు అంటే కేవలం వినోదం లేదా కాలక్షేపం కోసం చెప్పుకునే ఊహాజనిత కథలు కావు.. ఒక మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో వివరిస్తూ ఉత్తమమైన నైతిక విలువలను ఈ కథలు నేర్పుతాయి. మన పూర్వీకులు పిల్లలకు క్రమశిక్షణ, సంస్కారం, లోకజ్ఞానాన్ని సులభంగా నేర్పించడానికి నీతి కథలను బోధించేవారు. పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా విలువలతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో నీతి కథలు బోధిస్తాయి. అలాంటి ఒక చక్కని నీతి కథే ఈ “కపటబుద్ధి”. దుష్టుల మాటలు నమ్మితే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది.

కథ

అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒక సింహం. దానికి ఒక నక్క, ఒంటె సేవకులుగా ఉండేవి. కొన్ని సంవత్సరాల తర్వాత సింహం ముసలితనం కారణంగా..వేటాడలేక ఆకలితో అలమటించసాగింది. ఒకరోజు సింహం నక్కను పిలిచి ఆహారం తీసుకురమ్మంది.

సరిగ్గా అదే సమయంలో ఒంటె గుహ బయట కాపలా కాస్తోంది. జిత్తులమారి నక్క ఒంటెను చంపి ఆహారంగా తీసుకుందామని సింహానికి సలహా ఇచ్చింది. కానీ, సింహం కోపగించుకుంటూ… “ఒంటె చాలా కాలంగా నా సేవకుడు, అతడిని రక్షించడం నా బాధ్యత” అంది. అప్పుడు నక్క… “ఒకవేళ ఒంటె తనకు తానుగా ఆహారంగా సమర్పించుకుంటే?” అని అడిగింది. దానికి సింహం అంగీకరించింది.

నక్క కుతంత్రం – ఒంటె అమాయకత్వం..

నక్క వెంటనే ఒంటె దగ్గరకు వెళ్లి, “రాజుగారు ఆకలితో ఉన్నారు.. మనం ఆహారంగా సమర్పిస్తే ఆయన సంతోషించి పెద్ద బహుమతి ఇస్తారు” అని అబద్ధం చెప్పింది. నక్క మాటలు నమ్మిన అమాయకపు ఒంటె మొదట నక్కనే వెళ్లమంది.

గుహలోకి వెళ్ళిన నక్క… “రాజా! నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి” అని నాటకమాడింది. సింహం నక్కను మెచ్చుకుంది. అది చూసి ఒంటె కూడా తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలని తొందరపడుతూ… “నక్కను వదిలేసి నన్ను తినండి” అంది.

అంతే! సింహం ఒక్కసారిగా ఒంటెపై దాడి చేసింది. ఒంటె ఆందోళనగా… “బహుమతి ఇస్తానన్నారు కదా” అని అడగ్గా, నక్క కుటిలంగా నవ్వుతూ… “నీ యజమాని చేతిలో మరణించడమే నీకు దక్కే గొప్ప బహుమతి” అంది. చివరికి సింహం, నక్క కలిసి ఒంటెను తినేశాయి.

నీతి

దుష్టుల పాలనలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. కపట బుద్ధి గలవారితో స్నేహం లేదా వారి ఆశ్రయం ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అందుకే దుష్టులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Follow Us