నాగార్జునసాగర్‌కు మారిన తెలంగాణ పొలిటికల్ ఫోకస్.. ఉప ఎన్నికలో గట్టి అభ్యర్థిని దింపేందుకు బీజేపీ ప్లాన్
దుబ్బాక ముగిసింది. గ్రేటర్ పోరుకు తెరపడింది. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఫోకస్ నాగార్జునసాగర్‌కు మారింది. ఉప ఎన్నికల్లో బీజేపీ క్యాండేట్ ఎవరు?..
దుబ్బాక ముగిసింది. గ్రేటర్ పోరుకు తెరపడింది. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఫోకస్ నాగార్జునసాగర్‌కు మారింది. ఉప ఎన్నికల్లో బీజేపీ క్యాండేట్ ఎవరు? అనే దానిపై చర్చ మొదలైంది. దుబ్బాకలో గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. అదే ఊపుతో జీహెచ్‌ఎంసీలోనూ తొడగొట్టింది. దుబ్బాకలో రఘునందరావు లాంటి బలమైన అభ్యర్థితో బీజేపీ గేమ్ ఫర్‌ఫెక్ట్ నడిచింది. ఇది జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మంచి హైప్ తీసుకొచ్చింది. దీంతో అగ్రనేతలే తరలివచ్చి కమలం దళానికి మరింత ఊపు తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు తామే అల్టర్నేటివ్ అనే నిరూపించే ప్రయత్నం చేశారు. ఇలాఉండగా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరు నెలల సమయంలో బై పోల్ రూపంలో కమలదళం మరో పరీక్ష ఎదుర్కోబోతోంది.
నియోజకవర్గంలో చూస్తే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కంచుకోటలో జానారెడ్డి సీనియర్ నేతకు మంచి పట్టు ఉంది. తెలంగాణలో జెండా ఎగురవేస్తామని కలలు కంటున్న బీజేపీకి ఇక్కడ చాన్స్ ఉందా? అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే ఉప ఎన్నికలో గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌లో బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వలేదు. ఆ పార్టీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డికి కేవలం 2675 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 1.48 శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. నియోజకవర్గంలో రెడ్డి లేదా యాదవ్ సామాజికవర్గాలు బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. దీంతో ఈ వర్గాల నుంచే ఈ సారి క్యాండేట్‌లను పెట్టాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోన్నట్టు సమాచారం.