పంట కొనుగోలు బాధ్యత సర్కారుదేః కేసీఆర్

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

పంట కొనుగోలు బాధ్యత సర్కారుదేః కేసీఆర్
Balaraju Goud

|

Oct 06, 2020 | 9:08 PM

రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రతి గింజ ధాన్యం, పత్తిని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సీఎం.. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. పంట పెట్టుబడి మొదలు.. కొనుగోలు వరకు అన్ని విషయాల్లో సాగుదారునికి అండగా ఉంటామన్న కేసీఆర్.. రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

వానాకాలం పంట కొనుగోలుపై హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో కోటి 34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 52 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న సీఎం.. రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. 17 శాతం కంటే తక్కువ తేమ ఉండే ఏ- గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు 1,888 రూపాయలు, బి-గ్రేడ్ రకానికి 1,868 రూపాయల కనీస మద్దతు ధర చెల్లిస్తామన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రైతులు.. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సీఎం సూచించారు. వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పని చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తిని పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఈ విషయంలో ఏవైన సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu