కరోనా పరీక్షకు కొత్త పరికరం.. గంటలోపే ఫలితం..!
కరోనా పరీక్షలు పూర్తయ్యాక రిపోర్టు కోసం ఇంకా గంటల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు భిన్నంగా గంట కన్నా తక్కువ సమయంలోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించే ఒక ర్యాపిడ్ పరీక్ష విధానాన్ని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. కరోనా పరీక్షలు పూర్తయ్యాక రిపోర్టు కోసం ఇంకా గంటల తరబడి వేచిచూసే పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు భిన్నంగా గంట కన్నా తక్కువ సమయంలోనే కరోనా వైరస్ ఉనికిని గుర్తించే ఒక ర్యాపిడ్ పరీక్ష విధానాన్ని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి పెద్దగా ఉపకరణాలు అవసరం ఉండదంటున్నారు. ప్రామాణిక కొవిడ్-19 పరీక్ష విధానం స్థాయిలోనే ఇది సమర్థంగా పనిచేస్తుందంటున్నారు.
మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ సాధనానికి ‘స్టాప్ కొవిడ్’ అనే నామకరణం చేశారు. దీన్ని చౌకైన వస్తువులతో రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫలితంగా ప్రజలు నిత్యం స్వయంగా కరోనా పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలవుతుందంటున్నారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షకు ఒకే అంచెలో ప్రక్రియ మొత్తాన్ని ముగించే విధానాన్ని తాము కనుగొన్నామని పరిశోధనలో పాలుపంచుకున్న జూలియా యంగ్ చెప్పారు. అందువల్ల దీన్ని నిపుణులే కాకుండా ఇతరులూ నిర్వహించొచ్చని తెలిపారు.
కరోనా పరీక్షల కోసం ప్రత్యేకించి ఆస్పత్రి ల్యాబ్‌లకు వెళ్లకుండానే పరీక్ష చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానంలో.. నమూనాలోని వైరస్ జన్యు పదార్థానికి అయస్కాంత పూసలను జోడించినట్లు వివరించారు. ఇవి వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏను ఆకర్షిస్తాయి. ఫలితంగా జన్యు పదార్థ సాంద్రత పెరుగుతుంది. దీనివల్ల ఖరీదైన శుద్ధి కిట్‌ల అవసరం లేకుండానే కరోనా పరీక్ష ఫలితం వెలువడుతుందంటున్నారు ఎంఐటీ నిపుణులు. పైగా అలాంటి ప్రక్రియలకు ఎంతో సమయం పడుతుంది. ఆర్‌ఎన్‌ఏ సాంద్రత పెరగడం వల్ల పరీక్ష సున్నితత్వం పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పాజిటివ్ కేసుల నిర్ధారణలో ఈ కొత్త విధానం 93 శాతం మేర కచ్చితత్వాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. త్వరలో దీన్ని అందుబాటులో తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సమయం కూడా కలిసొస్తుందంటున్నారు.