Watch: సరళ మైసమ్మ ఆలయంలో హక్కుల రచ్చ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు..!
సరళ మైసమ్మ ఆలయం వద్ద బోనాల కుండల అమ్మకాల హక్కులపై రెండు గ్రామాల మహిళల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆలయం ఎవరి పరిధిలో ఉందనే దానిపై ఏర్పడిన అభిప్రాయభేదాలు ఘర్షణకు దారితీశాయి. మాటమాట పెరిగి చివరకు మహిళలు సిగపట్లు పట్టుకునే వరకు వెళ్ళింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

ఒక అమ్మవారి ఆలయం.. రెండు గ్రామాలు.. రెండు రెవెన్యూ పరిధులు.. చివరకు మహిళల మధ్య సిగపట్లకు దారి తీసిన హక్కుల పంచాయితీ. అమ్మవారి సన్నిధిలో కుండలు అమ్ముకునే హక్కుల కోసం మొదలైన వివాదం.. ఇరు గ్రామాల మహిళల మధ్య వాగ్వాదానికి.. ఘర్షణకు దారితీసింది. చివరికి మహిళలు సిగపట్లు పట్టుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గ్రామ పరిధిలో శ్రీసరళమైసమ్మ దేవస్థానం ఉంది. రాచకొండ గ్రామానికంటే.. చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామానికి సమీపంలో ఉంటుంది. రాచకొండ ప్రాంతంలో సరళ మైసమ్మ ఇలవేల్పుగా ఉంది. నిత్యం భక్తులతో అమ్మవారి ఆలయం కళకళలాడుతోంది. శ్రీ సరళ మైసమ్మ దేవస్థానం ఇప్పుడు రెండు గ్రామాల మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. ఆలయం దగ్గర కుండలు అమ్ముకునే అంశం ఇరు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది.
దేవస్థానం వద్ద వ్యాపారం చేసుకునే హక్కులు తమకే ఉన్నాయంటూ ఇరు వర్గాలు వాదించుకోవడంతో వివాదం మొదలైంది. క్రమంగా మాటామాటా పెరిగి మహిళల మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే సరళ మైసమ్మ ఆలయానికి వచ్చే భక్తులు మొక్కుల కోసం బోనాలు చెల్లిస్తుంటారు. రాచకొండ గ్రామంలో శాలివాహనులు ఎవరూ లేకపోవడంతో.. అల్లాపురంకు చెందిన శాలివాహనులు సరళ మైసమ్మ ఆలయం వద్ద కొన్నేళ్లుగా బోనాల కుండలను విక్రయిస్తున్నారు. అయితే తమ మండల పరిధిలో ఆలయం ఉన్నందున తమకే బోనాల కుండలను విక్రయించే హక్కు ఉందని సంస్థాన్ నారాయణపురంకు చెందిన కొందరు శాలివాహనులు పట్టుబట్టారు. అమ్మవారి సన్నిధిలో కుండలు అమ్ముకునే హక్కుల కోసం మొదలైన వివాదం.. ఇరు గ్రామాల మహిళల మధ్య వాగ్వాదానికి.. ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు గ్రామాలకు చెందిన వారు వాగ్వాదం తోపులాట జరుగుతుండగానే మహిళలు సిగ పట్లు పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న భక్తులు అవాక్కయ్యారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కనిపించాల్సిన చోట.. హక్కుల కోసం వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అమ్మవారి ఆలయం వివాదాలకు వేదిక కాకూడదు.. భక్తికి నిలయంగా ఉండాలి!
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
